Ap: మాజీ మంత్రి రావెలపై టీడీపీ కార్యకర్తల దాడి.. వింజనంపాడులో ఉద్రిక్తత!

  • గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ 
  • ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలకు పూలమాల వేయనందుకు ఆగ్రహం
  • రావెల, జయదేవ్‌పై దాడికి యత్నం.. పోలీసుల సాయంతో తప్పిన  ప్రమాదం

ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, ఎంపీ గల్లా జయదేవ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగడంతో గుంటూరు జిల్లా వింజనంపాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో నిర్వహించిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ గల్లా జయదేవ్‌ను కలిసిన ఓ వర్గం కార్యకర్తలు రావెల కిశోర్ బాబు తమ గ్రామానికి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమం నిర్వహించాలనుకుంటే గ్రామంలో మొదట్లో ఉన్న ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాతే లోపలికి అడుగుపెట్టాలని షరతు విధించారు. దీనికి ఆయన సరేనన్నారు.

అయితే, పార్టీలోని వేరే వర్గం వారు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాల వేయకుండానే ఆవిష్కరించడంతో ఆ వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని బహిష్కరించారు. దీంతో కార్యక్రమం పూర్తయిన తర్వాత మాజీ మంత్రి రావెలతో కలిసి అసంతృప్త వర్గం ఏర్పాటు చేసిన విగ్రహాలకు దండలు వేసేందుకు జయదేవ్ ప్రయత్నించారు. గమనించిన ఆ వర్గం నేతలు జయదేవ్, కిశోర్ బాబులను అడ్డుకున్నారు. వారిపై దాడికి ప్రయత్నించారు. దీంతో టీడీపీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని చక్కదిద్దారు. పోలీసుల సాయంతో ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి రావెల అక్కడి నుంచి బయటపడ్డారు.

More Telugu News