rajamouli: రాజమౌళికి కథ చెప్పి ఒప్పించే పనిలో ఉన్నా... ఒప్పించగలిగితే ఆపై హీరో ఎంపిక: విజయేంద్ర ప్రసాద్

  • రాజమౌళి ఒప్పుకుంటే ముందడుగు
  • సోషల్ కథతోనే తదుపరి చిత్రం
  • 'మహాభారతం' ఇప్పట్లో లేనట్టే
  • 'రౌడీ రాథోడ్'కు సీక్వెల్ రాస్తున్నా
  • రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్

తాజాగా తమిళంలో వచ్చిన 'మెర్సల్' చిత్రానికి దర్శకదిగ్గజం రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రీన్ ప్లేను అందించడం జరిగింది. ఈ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తాను ప్రస్తుతం రాజమౌళికి ఓ కథను వినిపించి, ఒప్పించే పనిలో ఉన్నానని అన్నారు. తన కొడుకు ఈ కథకు ఓకే చెబితే, ఆపై అందుకు సరిపడిన హీరో ఎంపిక మొదలవుతుందని చెప్పారు. సోషల్ కథతోనే ఓ సినిమా చేయాలని రాజమౌళి భావిస్తున్నాడని, అందుకు తగ్గ మంచి కథను తయారు చేశానని అన్నారు.

ఇక ఇప్పట్లో 'మహాభారతం' తీసే ఆలోచన లేదని చెప్పిన విజయేంద్ర ప్రసాద్, బాలీవుడ్ లో రెండు నిజ జీవిత కథలు రాస్తున్నానని తెలిపారు. అలాగే తెలుగులో సూపర్ హిట్ అయిన 'విక్రమార్కుడు' (హిందీలో రౌడీ రాథోడ్)కు సీక్వెల్ రాస్తున్నట్టు కూడా వెల్లడించారు. తాను విసుగు లేకుండా కథలు రాయగలనని, తనకు ఇదొక్క పనే తెలుసునని అన్నారు. ఇక దర్శకుడిగా ఎందుకు విజయవంతం కాలేకపోయానన్న విషయమై మరోసారి స్పందిస్తానని చెప్పారు.

More Telugu News