telangana: కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. త్వరలో రేషన్ షాపులు రద్దు?

  • ప్రజాపంపిణీ వ్యవస్థను రద్దు చేసి డీబీటీ పథకం అమలుకు యోచన
  • ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి అందించాలని నిర్ణయం
  • సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు కేసీఆర్ ఆదేశం

పేదలకు పిడికెడు బియ్యం అందించి ఆసరాగా నిలుస్తున్న రేషన్ షాపులను కేసీఆర్ సర్కారు రద్దు చేయనుందా? వీటిని రద్దు చేయడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని యోచిస్తోందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రేషన్ షాపులను రద్దు చేసి వాటి స్థానంలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఈ క్రమంలో రేషన్ షాపుల రద్దు వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌  పౌరసరఫరాల శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అధికారులు కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జరుగుతున్న అక్రమాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం లబ్ధి దారులకు నేరుగా నగదు అందించే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

నగదు నేరుగా లబ్ధిదారులకు అందడం వల్ల ప్రభుత్వంపై ఉన్న చెడ్డపేరు తొలగిపోతుందని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సబ్సిడీ బియ్యంపై ప్రభుత్వం కిలోకు రూ.25 భారం భరిస్తోంది. రేషన్ షాపులు రద్దు చేస్తే, కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి రూ.150 చొప్పున ఆ కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంత మందికీ ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పర్యవసానంగా కాస్త, అటూ ఇటుగా ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయల వరకు అందే అవకాశం ఉంది.

ప్రభుత్వ నిర్ణయం వల్ల డీలర్ల అవినీతికి చెక్ పడడంతోపాటు లబ్ధిదారులు తమకు ఇష్టం వచ్చిన బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. నగదు నేరుగా అందించడం వల్ల రేషన్ షాపుల ముందు పడిగాపులు కాసే అవస్థ తప్పుతుందని, ఏ సరుకులు కొనుక్కోవాలి? ఎప్పుడు కొనుక్కోవాలి? అన్నది లబ్ధిదారుడే నిర్ణయించుకుంటాడని అధికారులు చెబుతున్నారు.
 

More Telugu News