china: భారత్, చైనా మధ్య మరో వివాదం చెలరేగే అవకాశం ఉందంటోన్న విశ్లేషకులు!

  • ఇటీవలే సమసిన డోక్లాం వివాదం
  • బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్‌ నదుల వివరాలు చెప్పడం మానేసిన చైనా
  • వివరాలు చెప్పకపోవడంతో ఆస్తి, ప్రాణ నష్టాలు

చైనా అధీనంలోని టిబెట్‌ హిమనీనదాల నుంచి బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్‌తో పాటు పలు నదులు భారత్ వైపుగా ప్రవహిస్తుంటాయి. ఈ న‌దుల నీటి ప్రవాహ వివ‌రాల‌ను భార‌త్‌కు చైనా వివ‌రించాల్సి ఉంటుంది. చైనా ఆ వివ‌రాలు వెల్ల‌డిస్తేనే ఆ న‌దుల‌ ప్రవాహం నుంచి ఎదుర‌య్యే వ‌ర‌ద ముప్పును గుర్తించి ప్ర‌జ‌ల‌కు హెచ్చరికలు జారీ చేయవచ్చు. దీంతో ప్రాణ‌, ఆస్తినష్టాల‌ను తగ్గించ‌వ‌చ్చు. అయితే, ఈ విషయంలో గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను చైనా పాటించ‌డం లేదని స‌మాచారం.

అయితే, ఇటీవ‌ల తలెత్తి, స‌మ‌సిన డోక్లాం వివాదం నేప‌థ్యంలో చైనా... ఆయా నదీజలాల సమాచారాన్ని భారత్‌కు ఇవ్వడం లేదు. దీంతో బ్రహ్మపుత్ర, సట్లెజ్‌కు వరదలు వచ్చిన సమయంలో భార‌త్ క‌ష్టాలు ఎదుర్కుంది. అస్సాంలో బ్రహ్మపుత్ర వరదలకు 160 మంది మృతి చెందారు. పంజాబ్‌లో సట్లెజ్‌ నది పొంగి సుమారు 10 వేల ఎకరాలు నీటమునిగాయి.

ఆ వివరాలు చెప్పకపోవడంపై చైనా ఇత‌ర‌ కార‌ణాలు చెప్పుకుంటూ వ‌స్తోంది. టిబెట్‌ ప్రాంతంలో ఉన్న నదీజలాల గణాంకాల కేంద్రాలు వరదల కారణంగా దెబ్బతిన్నాయని, ఈ కార‌ణంగానే తాము ఆ వివరాల‌ను తెలపడం లేద‌ని చెబుతోంది. చైనా తీరుతో ఇరు దేశాల మ‌ధ్య మరో వివాదం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేష‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

More Telugu News