polavaram: ప్రాజెక్టులు తీసుకునేంత ఖర్మ జగన్ కు పట్టలేదు: వైవీ సుబ్బారెడ్డి

  • పోలవరంలో అవినీతి జరుగుతోంది
  • కాంట్రాక్టర్లను కాపాడుతున్నారు
  • కమిషన్ల కోసమే పోలవరంను చేపట్టారు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తొలి నుంచి కూడా ప్రభుత్వాన్ని వైసీపీ ప్రశ్నిస్తోందని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టా? కాదా? ప్రబుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు సరిగా పని చేయకపోతే, వారిని టెర్మినేట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ... సమయాన్ని వృథా చేయడానికి కేంద్ర మంత్రులను కలుస్తున్నారని అన్నారు.

విదేశీ పర్యటనకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగమేఘాల మీద కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారని... ఇదంతా ఎవరిని కాపాడటం కోసమని ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య ఏం చర్చ జరిగిందో బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల పేరు చెప్పి, మూడేళ్ల నుంచి సబ్ కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం పనుల్లో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. తమ అధినేత జగన్ కు ప్రాజెక్టులు తీసుకునేంత ఖర్మ పట్టలేదని చెప్పారు. కేవలం కమిషన్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును చేపట్టిందని అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టే కాదు, మరే ఇతర ప్రాజెక్టులో కూడా తాను పనులు చేయలేదని తెలిపారు.


More Telugu News