indians: భార‌తీయులు కాల్షియం త‌క్కువగా తీసుకుంటున్నార‌ట‌.... నివేదిక‌లో వెల్ల‌డి

  • కాల్షియం లోపిస్తే ఎముక‌ల వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌
  • 74 దేశాల్లో స‌ర్వే చేసిన బ్రౌన్ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు
  • చైనా, ఇండోనేషియా, వియ‌త్నాం దేశీయులు కూడా

వివిధ దేశాల ప్ర‌జ‌లు తీసుకుంటున్న‌ కాల్షియం మోతాదుల గురించి అమెరికాలోని బ్రౌన్ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న చేసి, ఆస్టియోపొరోసిస్ ఇంట‌ర్నేష‌నల్ జ‌ర్న‌ల్‌లో నివేదిక‌ను ప్ర‌చురించారు. ఈ నివేదిక ప్ర‌కారం వైద్య నిపుణులు సూచించిన దాని కంటే త‌క్కువ మోతాదులో భార‌త్‌, చైనా, ఇండోనేషియా, వియ‌త్నాం దేశాల ప్ర‌జ‌లు కాల్షియం తీసుకుంటున్నారు. ఈ దేశాల వారంతా రోజుకి 400 ఎంజీ కంటే త‌క్కువ కాల్షియం తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌ల ప‌గుళ్లు, ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశం అధికంగా ఉంద‌ని నివేదిక పేర్కొంది.

74 దేశాల్లో స‌ర్వే చేసి ఈ నివేదిక‌ను త‌యారు చేసిన‌ట్లు శాస్త్ర‌వేత్త ఈథ‌న్ బాల్క్ తెలిపారు. ద‌క్షిణ అమెరికా దేశాలు రోజుకి 400 - 500 ఎంజీ, ఉత్త‌ర ఆఫ్రికా, దూర ప్రాచ్య దేశాలు రోజుకి 500 - 600 ఎంజీ వ‌ర‌కు కాల్షియం తీసుకుంటున్న‌ట్లు తేలింది. ఉత్త‌ర ఐరోపాలో ఉండే దేశాలు మాత్రం అత్య‌ధికంగా ఒక్క రోజుకి 1000 ఎంజీ కంటే ఎక్కువ కాల్షియం తీసుకుంటున్నాయ‌ని నివేదిక తెలిపింది. ఉత్త‌ర ఐరోపా దేశాలు మిన‌హా మిగ‌తా ప్ర‌పంచ దేశాల‌న్నీ కాల్షియం తీసుకోవ‌డం మీద పెద్ద దృష్టి సారించ‌డం లేద‌ని పేర్కొంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కాల్షియం తీసుకోవ‌డంపై అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌సరం ఉంద‌ని వెల్ల‌డించింది. ఇంత‌కీ కాల్షియం అధికంగా గల ప‌దార్థాలు ఏంటో తెలుసా... పాల ప‌దార్థాలు, ఆకుకూర‌లు, బ‌ఠానీ గింజ‌లు, బాదం, రాగులు. స‌రిగ్గా చెప్పాలంటే.. రోజుకి ఒక గ్లాసు పాలు తాగినా చాలు.. శ‌రీరానికి కావాల్సిన కాల్షియం పాళ్లు అందుతాయి.

More Telugu News