revant: రేవంత్ సంచలన ఆరోపణలపై ఒక్క మాట కూడా మాట్లాడని ఏపీ నేతలు... కారణమిదే!

  • ఏపీ టిడీపీ నేతలపై రేవంత్ సంచలన ఆరోపణలు
  • ఇప్పటివరకూ స్పందన నిల్
  • ఆయన వ్యాఖ్యల అసలు ఉద్దేశం ఏంటో చూద్దాం
  • ఆపై మాత్రమే స్పందిద్దాం
  • అధినేత సూచనలతోనే మాట్లాడని ఏపీ టీడీపీ నేతలు!

కేసీఆర్ నుంచి యనమల రామకృష్ణుడు కంపెనీకి రూ. 2 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కాయి. పయ్యావుల కేశవ్ సంస్థలకు కూడా కాంట్రాక్టులు వెళ్లాయి. తెలంగాణలో మేము విమర్శిస్తుంటే, ఏపీలో మాత్రం నేతలు కేసీఆర్ తో అంటకాగుతున్నారు. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన కేసీఆర్ వంటి వ్యక్తితో స్నేహమా?... ఇవి తెలంగాణ టీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం ఏపీ టీడీపీ నేతలపై చేసిన ఆరోపణలు.

వీటిపై తీవ్ర దుమారం చెలరేగగా, ఇంతవరకూ ఏపీకి చెందిన ఒక్క టీడీపీ నేత కూడా స్పందించక పోవడం గమనార్హం. రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎవరూ ప్రకటన విడుదల చేయకపోవడం వెనుక ఉద్దేశమేంటన్న కొత్త చర్చ ఇప్పుడు మొదలైంది.

ఇదిలావుండగా, గత రెండు రోజుల నుంచి హైదరాబాద్ లోనే మకాం వేసిన నారా లోకేశ్, రేవంత్ ఉదంతం, తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. లోకేశ్ ను సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేకంగా కలిసినట్టు కూడా తెలుస్తోంది. ఇక అధినేత నుంచి వచ్చిన ఆదేశానుసారమే రేవంత్ వ్యాఖ్యలపై ఎవరూ మాట్లాడటం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోపణల వెనుక అసలు ఉద్దేశం ఏంటన్న విషయం తెలుసుకున్న తరువాతనే స్పందిద్దామని, అప్పటివరకూ వేచి చూడాలని పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం.

More Telugu News