ఒవైసీపై పోటీ చేయనున్న అజారుద్దీన్?

20-10-2017 Fri 10:05
  • హైదరాబాద్ నుంచి అజార్ పోటీ చేసే అవకాశం
  • ఒవైసీపై పోటీ చేయాలంటూ కాంగ్రెస్ నేతల సూచన
  • 2009లో మొరాదాబాద్ నుంచి గెలుపొందిన అజార్

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ లోక్ సభ స్థానంలో హోరాహోరీ పోటీ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే, చార్మినార్ వద్ద నిన్న అజారుద్దీన్ కు సద్భావన అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, అసదుద్దీన్ పై పోటీ చేయాలంటూ అజార్ కు సూచించారు.

కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, జానారెడ్డి, షబ్బీర్ అలీలు మాట్లాడుతూ, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం గురించి అజార్ కు మంచి అవగాహన ఉందని... ఇక్కడి ప్రజల సమస్యలు అజార్ కు తెలుసని... అందువల్ల ఇక్కడి నుంచి అజార్ పోటీ చేస్తే బాగుంటుందని అన్నారు. 2009 ఎన్నికల్లో మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి అజార్ పోటీ చేసి, గెలుపొందిన సంగతి తెలిసిందే.