sri: తగ్గిన ఇన్ ఫ్లో... శ్రీశైలం గేట్ల మూసివేతతో సందర్శకుల నిరాశ!

  • గణనీయంగా తగ్గిన వరద
  • ఈ ఉదయం గేట్లను మూసివేసిన అధికారులు
  • విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీరు
  • శ్రీశైలంలో 884 అడుగులకు పైగా నీటిమట్టం

గత కొన్ని రోజులుగా తెరచుకున్న శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లు ఈ ఉదయం మూతపడ్డాయి. ఎగువ నుంచి వస్తున్న వరద గణనీయంగా తగ్గడంతోనే అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి సుమారు 90 వేల క్యూసెక్కులకు పైగా నీరు వస్తోంది. ఈ నీటిని హంద్రీనీవా, కల్వకుర్తి తదితర ఎత్తిపోతల పథకాలు, పూర్తిస్థాయి జలవిద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. ప్రాజెక్టులోని 13 యూనిట్ల నుంచి విద్యుత్ ను తయారు చేస్తుండగా, 70 వేల క్యూసెక్కులకు పైగా నీరు నాగార్జున సాగర్ కు విడులవుతోంది. ఉన్నతాధికారుల సూచనల మేరకు శ్రీశైలంలో 883 అడుగులకు తగ్గకుండా నీటి నిల్వను కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం 884.20 అడుగుల మేరకు నీరు నిల్వ ఉంది.

 ఇక నాగార్జున సాగర్ విషయానికి వస్తే, 590 అడుగుల నీటి నిల్వ సామర్థ్యముండగా, ప్రస్తుతం 570 అడుగులకు నీరు చేరుకుంది. ప్రాజెక్టులో మొత్తం 255 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. ఆల్మట్టిలోకి 37 వేలు, తుంగభద్రకు 13 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా శ్రీశైలం డ్యామ్ గేట్లను తెరవడంతో ఆ మధుర దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. ఇక గేట్ల మూసివేత విషయం తెలియని వందలాది మంది ఈ ఉదయం ప్రాజెక్టు వద్దకు వచ్చి అక్కడి పరిస్థితి చూసి నిరాశ చెందారు.

sri

More Telugu News