Veda Krishnamurthy: ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో ఆడనున్న టీమిండియా మహిళా క్రికెటర్ వేద

  • హోబర్ట్ హరికేన్స్‌తో ఒప్పందం
  • ఇప్పటికే కాంట్రాక్ట్ కుదుర్చుకున్న హర్మన్‌ప్రీత్, స్మృతి మందన
  • చర్చలు జరుపుతున్న దీప్తి శర్మ

ఆస్ట్రేలియాలో నిర్వహించే మహిళల బిగ్ బాష్ లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్)లో భారత్‌కు చెందిన మరో మహిళా క్రికెటర్ ఆడనుంది. టీమిండియా క్రికెటర్ వేద కృష్ణమూర్తి ఈ మేరకు డబ్ల్యూబీబీఎల్ కోసం హోబర్ట్ హరికేన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఏడాది జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్రికెట్‌లో పాల్గొన్న జట్టులో వేద సభ్యురాలు. భారత్ తరపున డబ్ల్యూబీబీఎల్ పాల్గొంటున్న మూడో క్రికెటర్ వేద కృష్ణమూర్తే. ఆమె కంటే ముందు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందనలు డబ్ల్యూబీబీఎల్‌ కోసం కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. మరో క్రికెటర్ దీప్తి శర్మ కూడా డబ్ల్యూబీబీఎల్ ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్‌లో శర్మ అద్భుత ప్రదర్శన కనబరిచింది. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. అలాగే 20 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకుని బౌలింగ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది.

జూలైలో వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా మహిళా జట్టు ఇప్పటి వరకు మరే సిరీస్‌లోనూ పాల్గొనలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో సిరీస్ జరగనుంది.

More Telugu News