kerala: అమిత్ షా సవాల్ ను స్వీకరిస్తూనే... ఆయనకు సవాల్ విసిరిన కేరళ ముఖ్యమంత్రి!

  • ఆర్ఎస్ఎస్, బీజేపీల నుంచి నేర్చుకునేందుకు ఏమీ లేదు
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రాన్నైనా కేరళలా తయారు చేయగలరా?
  • బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కేరళ ఎంతో మెరుగ్గా ఉంది

బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ నుంచి కేరళ నేర్చుకునేందుకు ఏమీ లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. తిరువనంతపురంలో ఆయన మాట్లాడుతూ, మానవ వనరుల అభివృద్ధి విషయంలో అమిత్‌ షా చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని అన్నారు. అదే సమయంలో ఆయనకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా కేరళలా తయారు చేయగలరా? అని సవాల్ విసురుతున్నానని ఆయన తెలిపారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్కటైనా కేరళలా ఉందా? అని ప్రశ్నించారు. అమిత్‌ షా నుంచి నేర్చుకునేందుకు ఏమీ లేదని ఆయన అన్నారు. తాను కేవలం బీజేపీని మాత్రమే కాదని, ఆ పార్టీ పఠిస్తున్న అభివృద్ధి మంత్రాన్ని, ఆ పార్టీ సిద్ధాంతాన్ని కూడా సవాల్‌ చేస్తున్నానని ఆయన చెప్పారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం కూడా తమకు దరిదాపుల్లో కూడా లేదని ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధికి కేరళ పాటిస్తున్న అంతర్జాతీయ ప్రమాణాలను ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం కూడా పాటించడం లేదని ఆయన స్పష్టం చేశారు. కేరళలో ఆ పార్టీ పదిహేను రోజులపాటు నిర్వహించిన జన్‌ రక్ష యాత్ర ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. బీజేపీ చేపట్టిన జనరక్షా యాత్రను ఆయన హత్యారాజకీయాల యాత్రగా అభివర్ణించారు. కేరళ రాష్ట్రం బీజేపీలా మతపరమైన సిద్ధాంత రాష్ట్రం కాదని, పూర్తిగా లౌకిక రాష్ట్రమని ఆయన స్పష్టం చేశారు. అందుకే బీజేపీ నుంచి కానీ, ఆర్ఎస్ఎస్ నుంచి కానీ కేరళ నేర్చుకునేందుకు ఏమీ లేదని ఆయన తెలిపారు. 

More Telugu News