ISIS: ఐఎస్ ఖేల్ ఖతం! ఉగ్రవాదుల చెర నుంచి రక్కాకు విముక్తి.. ప్రాణభయంతో ఉగ్రవాదుల పరుగులు

  • ముగిసిన ఇస్లామిక్ స్టేట్ కథ
  • రక్కాను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించిన సిరియా సైన్యం
  • రక్కాలో ఎగిరిన సంకీర్ణ జెండా
  • ప్రాణభయంతో పరుగులు తీసిన వందలాదిమంది ఉగ్రవాదులు

ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కథ దాదాపు ముగిసినట్టే. ఐఎస్ కబంధ హస్తాల్లో పడి నలిగిపోయిన రక్కా నగరానికి స్వాతంత్ర్యం లభించింది. ఇస్లామిక్ స్టేట్ రాజధానిగా మారిన ఈ నగరాన్ని సంకీర్ణ సేనలు స్వాధీనం చేసుకున్నాయి. ఐఎస్ జెండా స్థానంలో సంకీర్ణ సేనల జెండా సగర్వంగా ఎగిరింది. సంకీర్ణ సేనల దెబ్బకు తట్టుకోలేకపోయిన ఉగ్రవాదులు కొందరు మరణించగా, మరికొందరు లొంగిపోయారు. ఇంకొందరు నగరం నుంచి పలాయనం చిత్తగించారు.

అమెరికా మద్దతుతో రక్కాకు విముక్తి కల్పించామని సిరియా పౌర సైన్యం ఎస్‌డీఎఫ్ ప్రకటించింది. రక్కా కోసం గత నాలుగు నెలలుగా తాము చేస్తున్న పోరాటం ఫలించినట్టు తెలిపింది. ఐఎస్ ఉగ్రవాదానికి మౌనసాక్షిగా నిలిచిన అల్ నయీమ్ సిటీ సెంటర్ స్క్వేర్‌లో జెండాను ఎగరేసినట్టు పేర్కొంది. 300 మంది ఉగ్రవాదులు తమ కుటుంబాలతో సహా లొంగిపోయారని, 1500 మంది ఉగ్రవాదులు 30 బస్సులు, 10 ట్రక్కుల్లో నగరం విడిచి పారిపోయారని వివరించారు.

 2014లో రక్కాను స్వాధీనం చేసుకున్న ఐఎస్ దానిని తమ రాజధానిగా మార్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాడులకు ఇక్కడి నుంచే వ్యూహరచన చేస్తోంది. అయితే, ఇరాక్, సిరియాల్లో ఇంకా పదివేల మంది వరకు ఉగ్రవాదులు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. రక్కా నగరంలో రహదారులు, భవనాల కింద ఉగ్రవాదులు ఏర్పాటు చేసిన బాంబులను తొలగించేందుకు సంకీర్ణ సేనలు రంగంలోకి దిగాయి.
 
 

More Telugu News