Denied ambulance: కూతురి మృత‌దేహాన్ని భుజాల‌పై వేసుకుని నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన తండ్రి

  • పాట్నాలోని ఎయిమ్స్ లో ఘటన
  • కౌంటర్ వద్ద బాలిక తండ్రి క్యూలో నిలబడడంతో చికిత్స ఆలస్యం
  • ప్రాణాలు కోల్పోయిన బాలికకు అంబులెన్సు స‌దుపాయం క‌ల్పించ‌ని ఆసుపత్రి సిబ్బంది

ఆసుప‌త్రి సిబ్బంది అంబులెన్సు స‌దుపాయం క‌ల్పించ‌క‌పోవ‌డంతో ఓ తండ్రి త‌న కూతురి మృత‌దేహాన్ని త‌న‌ భుజాలపై  పెట్టుకుని తీసుకెళ్లిన ఘ‌ట‌న బీహార్ రాజ‌ధాని పాట్నాలో చోటు చేసుకుంది. ఇటువంటి దారుణ‌ ఘ‌ట‌న‌లు దేశంలో ఇప్ప‌టికే ఎన్నో వెలుగులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ పున‌రావృతం అవుతుండ‌డం గ‌మ‌నార్హం. ఆరు రోజులుగా తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతోన్న త‌న కూతురు రౌష‌న్ కుమారి (9) ని రామ్‌బాల‌క్ దంప‌తులు పాట్నాలోని ఎయిమ్స్ కి తీసుకొచ్చారు. ఈ క్ర‌మంలో ఔట్ పేషెంట్ బ్లాక్‌లో ఆమెను ఉంచి, రిజిస్ట్రేష‌న్ కార్డ్ కోసం ఆ బాలిక తండ్రి కౌంట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాడు. అయితే, ఆ కౌంట‌ర్ వ‌ద్ద భారీ క్యూ ఉంది.

త‌న కూతురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, తాను ముందుకు వెళ‌తాన‌ని ఆయ‌న క్యూలో నిల‌బ‌డ్డ వారిని వేడుకున్నాడు. క్యూలో నిలబడ్డవారు కనీస మానవత్వం కూడా చూపకుండా ససేమిరా అనడంతో ఆ తండ్రి కౌంటర్లోని క్లర్క్ ని కూడా వేడుకున్నాడు. క్లర్క్ కూడా లైనులో నిలబడాల్సిందే అనడంతో చేసేది ఏమీలేక క్యూలో నిల‌బ‌డి పేషెంట్‌ రిజిస్ట్రేష‌న్ కార్డ్ తీసుకునే స‌రికి ఆల‌స్యం అయిపోయింది. త‌న కూతురి వ‌ద్ద‌కు వెళ్లేస‌రికి ఆమె చ‌నిపోయింది.

దీంతో ఆమె మృత‌దేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాల‌ని వేడుకున్నాడు. వారు అంబులెన్సు కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ పేద తండ్రి త‌న భుజాల‌పైనే కూతురి మృత‌దేహాన్ని పెట్టుకుని నాలుగు కిలోమీట‌ర్లు న‌డిచి ల‌ఖిస‌రాయి జిల్లాలోని ఫుల్వారి ష‌రీఫ్ వ‌ద్ద ఉన్న ఆటో రిక్షా స్టాండ్‌ వ‌ర‌కు తీసుకెళ్లాడు. అక్క‌డి నుంచి ఆటో రిక్షాలో త‌న‌ కాజ్రా గ్రామానికి తీసుకెళ్లాడు.

కాగా, ఆ బాలిక‌కు చికిత్స అంద‌క‌పోవ‌డంతో చ‌నిపోయింద‌న్న విష‌యం త‌న దృష్టికి రాలేద‌ని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డా.ప్ర‌భాత్ కుమార్ సింగ్ అన్నారు. విష‌మ ప‌రిస్థితుల్లో త‌మ ఆసుప‌త్రికి వ‌చ్చే రోగుల‌కి వైద్యులు వెంట‌నే చికిత్స అందిస్తార‌ని, ఆ త‌రువాతే రిజిస్ట్రేష‌న్ కార్డ్ తీసుకుర‌మ్మ‌ని చెబుతార‌ని, ఈ ఘ‌ట‌న ఎలా జ‌రిగిందో అర్థం కావ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతాన‌ని చెప్పారు. 

More Telugu News