jagga reddy: రెడ్లు ఏకం కావాలి.. కేసీఆర్ బతుకు బజారుపాలు చేయాలి: జగ్గారెడ్డి

  • కేసీఆర్ పాలనలో ప్రజల ఆశలు ఆవిరయ్యాయి
  • కోదండరామ్ ఇప్పుడు ఎందుకు దోషిగా కనిపిస్తున్నారు?
  • అన్ని పార్టీల్లోని రెడ్లు జాగ్రత్త పడాలి

తెలంగాణలోని రెడ్డి కులస్తులంతా ఏకం కావాలని... ముఖ్యమంత్రి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయని... జేఏసీ ఏర్పాటు తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలన్నీ ఉద్యమంలో భాగస్వాములయ్యాయని తెలిపారు. వీరంతా ఏనాడూ టీఆర్ఎస్ తో కలసి పనిచేయలేదని అన్నారు. రాజకీయేతర పోరాటంతోనే తెలంగాణ వస్తుందనే భావనతో... అందరూ జేఏసీలో భాగస్వాములు అయ్యారని చెప్పారు.

సొంత రాష్ట్రం వస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ ప్రజలు భావించారని... అయితే, కేసీఆర్ పాలనలో వారి ఆశలన్నీ ఆవిరయ్యాయని జగ్గారెడ్డి అన్నారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ కు కోదండరామ్ ముద్దుగా కనిపించారని... ఇప్పుడు ఎందుకు దోషిగా కనిపిస్తున్నారని ప్రశ్నించారు. రెడ్డి సామాజికవర్గాన్ని అణగదొక్కడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రెడ్డిలంతా ఏకమైతే కేసీఆర్ బతుకు బజారుపాలవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, బీసీలతో రెడ్డి కులస్తులకు మాత్రమే అవినాభావ సంబంధం ఉందని... వెలమ కులస్తులకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అన్ని పార్టీల్లో ఉన్న రెడ్డి కులస్తులు జాగ్రత్త పడాలని సూచించారు. 

More Telugu News