jail: జైల్లో సంపాదించిన మొత్తాన్ని స‌హ‌ఖైదీలకు దానం చేసిన త‌ల్వార్ దంప‌తులు!

  • రూ. 98వేల వ‌ర‌కు సంపాదించిన నూపుర్‌, రాజేశ్‌
  • చాలా వ‌స్తువుల‌ను జైల్లోనే వ‌దిలేశారు
  • 15 రోజుల‌కు ఒక‌సారి జైలుకు వ‌చ్చి వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని మాటిచ్చారు
  • వెల్లడించిన జైలు అధికారులు

ఆరుషి, హేమ‌రాజ్ జంట హ‌త్యల కేసులో నాలుగేళ్ల‌పాటు జైలు శిక్ష అనుభ‌వించి త‌ల్వార్ దంప‌తులు రాజేశ్ త‌ల్వార్‌, నూపుర్ త‌ల్వార్‌లు త‌మ శిక్షా కాలంలో సంపాదించిన మొత్తాన్ని దాస్నా జైలులోని స‌హ‌ఖైదీల బాగు కోసం దానం చేశారు. వారిద్ద‌రూ క‌లిసి దాదాపు రూ. 98వేల రూపాయ‌ల వ‌రకు వేత‌నంగా పొందిన‌ట్లు జైలు అధికారులు చెప్పారు. రాజేశ్ త‌ల్వార్ 1,471 రోజులు, నూపుర్ త‌ల్వార్ 1,451 రోజులు జైల్లో ఉన్నారు.

`తాము జైల్లో సంపాదించిన డ‌బ్బును త‌మ‌తో పాటు తీసుకెళ్ల‌బోమ‌ని త‌ల్వార్ దంప‌తులు ఎప్పుడో చెప్పారు. జైలు బాగు కోసం, ఖైదీల కోసం దానం చేస్తామ‌ని వాళ్లు చెప్పారు. వారు చెప్పిన‌ట్లుగానే చెరో రూ. 49వేల రూపాయ‌ల‌ను దానం చేశారు. అంతేకాకుండా వాళ్ల వ్య‌క్తిగ‌త వ‌స్తువుల‌ను కూడా చాలా వ‌ర‌కు ఇక్క‌డే వ‌దిలి వెళ్లారు. కేవ‌లం అవ‌స‌ర‌మైన వాటినే తీసుకెళ్లారు` అని దాస్నా జైలు సూప‌రింటెండెంట్ దాదిరామ్ మౌర్య చెప్పాడు.

జైలులో ఉన్నపుడు రాజేశ్ త‌ల్వార్ దంత వైద్యశాల‌లో ప‌నిచేయ‌గా, ఆయ‌న భార్య నూపుర్ అత‌నికి స‌హాయంగా ఉండేది. అప్పుడప్పుడు మ‌హిళా ఖైదీలతో నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల్లో కూడా ఆమె పాల్గొనేది. అల‌హాబాద్ కోర్టు వారిని నిర్దోషులుగా ప్ర‌క‌టించిన త‌ర్వాత వారిద్ద‌రూ జైలులో ఉన్న ఖైదీలంద‌రినీ క‌లిశారు. విడుద‌ల‌య్యాక కూడా ప్ర‌తి 15 రోజుల‌కు ఒక‌సారి వ‌చ్చి ఖైదీల‌కు వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని వారు మాటిచ్చార‌ని దాదిరామ్ తెలిపారు.

More Telugu News