gold: దీపావళి సీజన్ లో... బంగారం కన్నా వాహనాలవైపే మొగ్గు!

  • బంగారం అమ్మకాలు అంతంతే
  • అడ్డుపడిన పలు రకాల నిబంధనలు
  • పెరిగిన వాహనాలు, గృహోపకరణాల కొనుగోళ్లు
  • ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లే కారణమంటున్న నిపుణులు

ఈ దీపావళి పండగ సీజన్ లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే వారికన్నా, నూతన వాహనాలు కొనుగోలు చేస్తున్నవారే అధికంగా కనిపిస్తున్నారు. వాహనాలతో పాటు నూతన గృహోపకరణాల అమ్మకాలు తృప్తికరంగా సాగుతుండగా, బంగారం విక్రయాలు గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ఇండియాలో సంవత్సరం మొత్తం సాగే అమ్మకాల్లో దసరా, దీపావళి పండగ సీజన్ వాటా 30 శాతం ఉంటుంది. ఎందుకంటే పలు రకాల డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు వెల్లువెత్తుతుంటాయి కాబట్టి. దీనికితోడు సులభ వాయిదాల సదుపాయం కూడా బంగారంపై ఉండే మోజును వాహనాలు, గృహోపకరణాలవైపు మళ్లేలా చేస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, ఈ పండగ సీజన్ లో అత్యవసరాలు ఉన్న వాళ్లు కొనడం తప్ప, పెట్టుబడులు పెట్టాలని ఎవరూ బంగారాన్ని కొనుగోలు చేయడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో రూ. 50 వేల ధరకు మించి ఆభరణాలను కొనుగోలు చేస్తే, ఐటీ శాఖకు వెల్లడించాలన్న నిబంధన బంగారంపై మక్కువను తగ్గించిందని ఆలిండియా జెమ్స్‌ అండ్‌ జువెలరీ ట్రేడ్‌ ఫెడరేషన్‌ (జీజేఎఫ్‌) ఛైర్మన్‌ నితిన్‌ ఖండేల్‌ వాల్‌ అన్నారు. గత సంవత్సరం కన్నా అమ్మకాలు పెరిగే పరిస్థితి లేదని తెలిపారు. అన్ని రకాల బంగారు ఆభరణాలకు సులభ వాయిదాల పద్ధతి ఉంటే అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News