ఉద్యోగం లేకే సినిమాల్లోకి వచ్చాను!: సాయి ధ‌ర‌మ్ తేజ్‌

17-10-2017 Tue 13:54
  • మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేసేందుకు రెడీ
  • నానితో చేయాల‌నుంది
  • పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడిన సాయి
త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించాడు. ఈ లైవ్‌లో ఆయ‌న చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పాడు. త‌ను సినిమాల్లోకి రావ‌డానికి కార‌ణం ఏంట‌నే ప్ర‌శ్న‌కు నిరుద్యోగం, మ‌రో అవ‌కాశం లేక‌పోవ‌డం వ‌ల్లే వ‌చ్చాన‌ని చ‌మ‌త్క‌రించాడు.

అంతేకాకుండా, తాను మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల్లో చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, హీరో నానితో క‌లిసి న‌టించాల‌ని ఉంద‌ని పేర్కొన్నాడు. త‌న త‌దుప‌రి చిత్రం `జ‌వాన్` సినిమా విడుద‌ల తేదీని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని, రామ్‌చ‌ర‌ణ్‌ `రంగ‌స్థ‌లం` ఫ‌స్ట్‌లుక్‌ని కూడా త్వ‌ర‌గా విడుద‌ల చేయాల‌ని చ‌ర‌ణ్ మీద‌ ఒత్తిడి తీసుకువ‌స్తాన‌ని సాయి ధ‌రమ్ తేజ్ అభిమానుల‌కు మాటిచ్చాడు.

అవ‌కాశం వ‌స్తే విల‌న్ పాత్ర‌లో కూడా న‌టిస్తాన‌ని సాయి చెప్పాడు. వి.వి. వినాయ‌క్ చిత్రంలో తాను ద్విపాత్రాభిన‌యం చేయ‌డం లేద‌ని, ర‌వితేజ `రాజా ది గ్రేట్‌` చిత్రంలో తాను ఎలాంటి అతిథి పాత్ర చేయ‌లేద‌ని స్పష్టం చేశాడు. అవ‌కాశం వ‌స్తే పవన్‌ కల్యాణ్‌, ఎన్టీఆర్‌, మెగా ఫ్యామిలీ వారందరితో న‌టిస్తాన‌ని సాయి ధ‌ర‌మ్ తేజ్ చెప్పాడు.

నేటిత‌రం హాస్యన‌టుల్లో వెన్నెల కిశోర్‌, సత్య, వైవా హర్ష  అంటే చాలా ఇష్టమ‌ని పేర్కొన్నాడు. ‘రౌడీ అల్లుడు’ లాంటి సినిమా చేయండి?` అని ఓ అభిమాని కోర‌గా.. `పాటలు రీమేక్‌ చేస్తేనే ఏవేవో అంటున్నారు. మళ్లీ ‘రౌడీ అల్లుడు’లాంటి స్క్రిప్ట్‌ మనకెందుకండి. హ్యాపీగా మన పనిచేసుకుంటే సరిపోతుంది` అని సాయి ధ‌ర‌మ్ తేజ్ ఛ‌లోక్తి విసిరాడు. ‘తొలిప్రేమ’ లాంటి క్లాసిక్‌ను రీమేక్ చేసే ఉద్దేశం లేద‌ని తెలిపాడు. అలాగే ‘ఖుషీ’ సినిమాను నాలుగు సార్లు చూసిన‌ట్లు వెల్ల‌డించాడు.