nallamala: నల్లమలలో అర్ధరాత్రి నరకం చూసిన వాహనదారులు.. ప్రమాదంతో 8 గంటలు స్తంభించిన ట్రాఫిక్

  • ఎదురెదురుగా వస్తున్న లారీలు ఢీ
  • క్యాబిన్‌లో ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేసిన డ్రైవర్
  • రాత్రంతా నరకం చూసిన ప్రయాణికులు, వాహనదారులు

నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆదివారం రాత్రి వాహనదారులు నరకం చూశారు. ఓ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాలు రాత్రంతా అక్కడే చిక్కుకుపోయాయి. బయటపడే మార్గం లేక నానా అవస్థలు పడ్డారు. గిద్దలూరు-నంద్యాల మధ్య ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొని రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయాయి. దీంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు, బస్సుల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం జరిగిన ఓ లారీలోని డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఐదు గంటలపాటు శ్రమించి అతడిని రక్షించారు.

నంద్యాల నుంచి గుంటూరు వైపు శనగ లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న గ్రానైట్ లారీని ఢీకొట్టింది. లారీల క్యాబిన్లు ఒకదానిలోకి ఒకటి చొచ్చుకుపోయాయి. ప్రమాదాన్ని ముందే గమనించిన శనగలోడు లారీ డ్రైవర్ కిందికి దూకి పరారయ్యాడు. మరో లారీలోని డ్రైవర్ శ్రీనివాసులు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. సాయం కోసం అర్ధరాత్రి అడవిలో ఆర్తనాదాలు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్యాస్ కట్టర్లు, రంపాలు, ప్రొక్లెయినర్లు ఉపయోగించి డ్రైవర్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ట్రాఫిక్ మొత్తం క్లియర్ కావడానికి 8 గంటలు పట్టింది. అప్పటి వరకు బస్సుల్లో, ఇతర వాహనాల్లో ఉన్న ప్రయాణికులు అల్లాడిపోయారు.

More Telugu News