sai prajwala: పోలీసులకు తలనొప్పి... అంతుచిక్కని ప్రజ్వల ఆచూకీ?

  • గత వారం అదృశ్యమైన ప్రజ్వల
  • నారాయణ కాలేజీల్లో ఒత్తిడిపై లేఖ
  • సీసీ కెమెరాల్లో ఒంటరిగా వెళుతున్న దృశ్యాలు
  • నేడు కళాశాల యాజమాన్యాలతో ఏపీ మంత్రి గంటా భేటీ

తాను చదువుతున్న నారాయణ కళాశాలలో తీవ్రమైన ఒత్తిడి ఉందని, దాన్ని తట్టుకోలేక పోతున్నానని చెబుతూ లేఖ రాసి గతవారం హైదరాబాద్ శివారు ప్రాంతమైన మేడిపల్లి లోని తన ఇంటి నుంచి అదృశ్యమైన సాయి ప్రజ్వల కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విచారిస్తుండగా, ఇంతవరకూ సరైన ఆధారాలేవీ లభించలేదని తెలుస్తోంది. ప్రజ్వల ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా, ఆమె తల్లిదండ్రుల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది.

ప్రజ్వల ఇంటి నుంచి కాలేజీకి వెళ్లే మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే, కొన్ని చోట్ల అమ్మాయి ఒంటరిగా వెళుతున్నట్టు రికార్డయింది. అంతకుమించి మరేమీ ఆధారాలు లభ్యంకాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కాలేజీలో చదువు కోసం టార్చర్ పెడుతున్నారని ప్రజ్వల రాసిన లేఖ, తెలుగు రాష్ట్రాల్లో బలవంతపు చదువులపై మరోసారి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది.

ఇదిలావుండగా, నేడు కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలతో మంత్రి గంటా శ్రీనివాస్ భేటీ కానున్నారు. కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, వారిపై ఉన్న ఒత్తిడి తదితరాలపైనే వీరు చర్చించనున్నట్టు సమాచారం.

More Telugu News