ys jagan: బీసీలపై ప్రత్యేక దృష్టి... పాదయాత్రకు ముందు వైఎస్ జగన్ కీలక అడుగులు!

  • నేడు బీసీ సంఘాలతో సమావేశం
  • బీసీ డిక్లరేషన్ తయారీలో వైకాపా
  • తదుపరి ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలతో మీటింగ్
  • రాష్ట్రమంతా తిరిగిరానున్న వైఎస్ జగన్

నవంబర్ 2 నుంచి పాదయాత్రను ప్రారంభించి, రాష్ట్రమంతటా కాలినడకన తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ కేడర్ ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా కదులుతున్న జగన్, నేడు బీసీ సంఘాలతో కీలక సమావేశం జరపనున్నారు. రాష్టంలో 50 శాతానికి పైగా జనాభా ప్రాతినిధ్యమున్న బీసీల సంక్షేమం, వారి అభ్యున్నతి, అందుతున్న సంక్షేమ పథకాలు, తదుపరి దశలో తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై వివిధ బలహీన వర్గాల సంఘాల నేతలతో జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా బీసీలకు అండగా వైకాపా ఉంటుందన్న భరోసాను కల్పించే దిశగా బీసీ డిక్లరేషన్ ను సైతం వైకాపా రూపొందించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల పరిస్థితి, వారి సమస్యలను గుర్తించి, పరిష్కార మార్గాల అన్వేషణ తదితరాలను చర్చించేందుకు ఈ సమావేశం జరగనుందని వైకాపా నేతలు పేర్కొన్నారు. అన్ని వర్గాల వారి అభిప్రాయాలను సేకరించడమే జగన్ లక్ష్యమని, పాదయాత్రకు ఈ సమావేశం ఉపకరిస్తుందని తెలిపారు. కాగా, అన్ని జిల్లాల నుంచి బీసీ నేతలు ఈ సమావేశానికి వస్తుండటంతో, జగన్ పాదయాత్రకు జన సమీకరణ తదితరాలపై నేతలకు దిశానిర్దేశం చేయవచ్చని తెలుస్తోంది. ఇదే సమయంలో నేతల సూచనలపై రూట్ మ్యాప్ లో చేయాల్సిన మార్పులపైనా నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. పాదయాత్ర ప్రారంభించే లోపు ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలతోనూ జగన్ సమావేశం అవుతారని తెలుస్తోంది.

More Telugu News