aadhar card: మొబైల్, పాన్, బ్యాంక్, సబ్సిడీ... ఆధార్ లింక్ చేసేందుకు తుది గడువులివే!

  • పాన్, బ్యాంక్ ఖాతాలకు ఆఖరి తేదీ డిసెంబర్ 31
  • మొబైల్ నంబర్ తో అనుసంధానానికి ఫిబ్రవరి 2018
  • గడువులోగా పూర్తి కాకుంటే సంక్షేమ పథకాల ప్రయోజనాలు కట్

వంట గ్యాస్ నుంచి పింఛన్ తీసుకోవాలన్నా, రేషన్ తీసుకోవాలన్నా, చివరికి రైలెక్కాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. భూముల కొనుగోలు, విక్రయాలు, కొత్త సిమ్ కార్డు, రేషన్, పాన్ కార్డులు, పాస్ పోర్టు, బ్యాంకు ఖాతా... ఇలా ఏది తీసుకోవాలన్నా 12 అంకెల ఆధార్ కార్డు తప్పనిసరి. పలు కీలక సేవా విభాగాలతో ఆధార్ అనుసంధానం శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏ విభాగంలో ఆధార్ అనుసంధానానికి ఏ తేదీ వరకూ గడువుందన్న విషయాన్ని తెలుసుకుందాం...

సిమ్ కార్డు నెంబర్ తో: సిమ్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి ఆఖరు తేదీ ఫిబ్రవరి, 2018. సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఆధార్ లింక్ ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక సంబంధిత టెలికం సంస్థకు వెళ్లి, మొబైల్ నంబర్ చెబితే, ఆ నంబర్ కు ఓ ఓటీపీ వస్తుంది. ఓటీపీతో పాటు ఆధార్ నంబర్ ఇచ్చి, బయో మెట్రిక్ మిషన్ పై వేలిముద్రను వేస్తే ఆధార్, మొబైల్ అనుసంధానం పూర్తవుతుంది. కొత్త సిమ్ కార్డులయితే, ఆధార్ ఆధారిత ఈ-కేవైసీతోనే కంపెనీలు సిమ్ కార్డులను జారీ చేస్తున్నాయి.

బ్యాంక్ ఎకౌంట్ తో: బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానాన్ని డిసెంబర్ 31, 2017లోగా పూర్తి చేసుకోవాల్సి వుంటుంది. నెట్ బ్యాకింగ్ ఏటీఎం, ఎస్ఎంఎస్ లేదా మొబైల్ బ్యాకింగ్ విధానంలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ సంవత్సరం చివరిలోపు అనుసంధానం పూర్తి కాకుంటే బ్యాంకు ఎకౌంట్లను సస్పెన్షన్ లో ఉంచుతారు.

పాన్ కార్డుతో : పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి కూడా డిసెంబర్ 31 వరకు మాత్రమే గడువుంది. వాస్తవానికి పాన్, ఆధార్ గడువు ఆగస్టుతోనే ముగిసినా, ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు ఆధార్ తప్పనిసరి కావడంతో గడువును పెంచారు. ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పేజీలో సులువుగానే అనుసంధానాన్ని పూర్తి చేయవచ్చు.

సబ్సిడీ అందించే పథకాలకు: వివిధ సామాజిక భద్రతా పథకాల ద్వారా ప్రయోజనాలను పొందే వారంతా డిసెంబర్ 31లోగా ఆయా పథకాలతో ఆధార్ నెంబరు అనుసంధానం చేసుకోవాలి. ఎల్పీజీ సబ్సిడీ నుంచి విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, వయోవృద్ధులకు పెన్షన్లు, పీపీఎఫ్, పొదుపు పథకాలు... ఇలా ఎక్కడైనా, ఎందులోనైనా ఆధార్ అనుసంధానం తప్పనిసరి.

More Telugu News