david warner: కోహ్లీ నాయకత్వ తీరు చూస్తుంటే అసూయగా ఉంది: డేవిడ్ వార్నర్

  • జట్టును నడిపిస్తున్న తీరు అద్భుతం
  • దగ్గరుండి చూస్తూ వచ్చాను
  • ఏడాదిలో ఎన్నో మెట్లు ఎక్కిన టీమిండియా
  • ఆస్ట్రేలియా కెప్టెన్ డేవిడ్ వార్నర్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వ లక్షణాలను చూస్తుంటే తనకు ఆసూయగా ఉందని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ లో వర్షం కారణంగా టీ-20 పోరు రద్దు కావడంతో సిరీస్ లో సమంగా నిలిచిన తరువాత వార్నర్ 'ఇండియా టుడే' తో మాట్లాడాడు. ఇటీవలి 5 వన్డేలు, రెండు టీ-20 పోటీల్లో తాను కోహ్లీ నాయకత్వాన్ని దగ్గర నుంచి చూశానని, అతను జట్టును నడిపించిన తీరు అద్భుతమని కితాబిచ్చాడు.

గత 12 నెలల కాలంలో భారత క్రికెట్ ఎన్నో మెట్లు ఎక్కిందని, దానికి కోహ్లీ లీడర్ షిప్ కారణమని అన్నాడు. ఆట పట్ల పూర్తి నిబద్ధత చూపుతూ తోటి ఆటగాళ్లకు స్వేచ్ఛనివ్వడమే కోహ్లీ విజయాలకు కారణమని విశ్లేషించాడు. ఈ సంవత్సరం జనవరిలో మహేంద్ర సింగ్ ధోనీ నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలను కోహ్లీ స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆపై ఎన్నో సిరీస్ లను కోహ్లీ గెలిపించాడు. శ్రీలంకలో పర్యటించి, ఆ దేశాన్ని మట్టికరిపిస్తూ, వైట్ వాష్ సాధించిన తొలి భారత కెెప్టెన్ గానూ రికార్డు సృష్టించాడు.

More Telugu News