amaravati: ఇక అమరావతి వంతు... భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న కొండవీటి వాగు

  • నాలుగు గంటల వ్యవధిలో 6 సెంటీమీటర్ల వర్షం
  • ఉప్పొంగుతున్న వాగులు, వంకలు
  • పలు చోట్ల రహదారులపైకి వరదనీరు
  • నిలిచిన వాహనాల రాకపోకలు

నిన్నటివరకూ రాయలసీమను అస్తవ్యస్తం చేసిన భారీ వర్షాలు, ఇప్పుడు నవ్యాంధ్ర రాజధానిపై పడ్డాయి. గత రెండు రోజులుగా, పల్నాడు సహా, గుంటూరు, సత్తెనపల్లి, పత్తిపాడు, పెదకూరపాడు, తాడేపల్లి, ఉండవల్లి తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో అమరావతిని చుడుతూ ప్రవహించే కొండవీటి వాగుకు వరద కళ వచ్చింది. అమరావతి, పెదకూరపాడు మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు.

వందలాది ఎకరాల పంట నీట మునిగిందని, చిన్న చిన్న కాలువలు పొంగి పొరలుతుండగా, పలు చప్టాలపై నీరు మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు మేరకు ప్రవహిస్తోందని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని, తాజా వర్షాలతో పత్తి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని అన్నారు. నాలుగు గంటల వ్యవధిలో 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు.

కాగా, కుమ్మరిపాలెం వద్ద వాగు పొంగి అచ్చెంపేట - క్రోసూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మత్తాయిపాలెం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. మరో రెండు రోజుల పాటు వర్షాలకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

More Telugu News