hyderabad rains: హైదరాబాదీలకు పుష్కలంగా నీరు... సమ్మర్ వరకూ కొరత లేనట్టే!

  • ప్రతి రోజూ నీటిని సరఫరా చేసే ఆలోచన
  • జలాశయాల్లో సంతృప్తికరంగా నీరు
  • రూ. 1,900 కోట్లతో పైప్ లైన్ల విస్తరణ

భాగ్యనగరిలో ఇక ప్రతి రోజూ నీటిని సరఫరా చేసినా కూడా, వచ్చే వేసవి వరకూ నీళ్లకు దిగులు చెందాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూరు, మంజీరా జలాశయాలు నిండుకుండగా మారడం, నగరానికి నీరందించే నాగార్జున సాగర్, ఎల్లంపల్లి (గోదావరి) జలాశయాల్లో నీరు సంతృప్తికరంగా ఉండటంతో తాగునీటి కష్టాలకు విముక్తి పడ్డట్టేనని అధికారులు అంటున్నారు. నాగార్జున సాగర్ లోకి ఇప్పుడున్న వరద ప్రవాహమే మరో వారం రోజులు కొనసాగితే, జలాశయం మొత్తం నిండిపోతుంది.

కాగా, ఇప్పటికీ హైదరాబాద్ నగర శివారు కాలనీల్లో నాలుగైదు రోజులకు లేదా వారం రోజులకు ఒకసారి మంచి నీరు సరఫరా జరిగే కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీలన్నింటికీ ఇప్పుడు సరఫరా చేస్తున్నట్టు రోజు మార్చి రోజు నీరు అందించేందుకు రూ. 1,900 కోట్లతో మునిసిపల్ సర్కిళ్లలో మంచినీటి పైప్ లైన్ ఇతర మౌలిక వనరుల విస్తరణ పనులు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఇక రోజూ నీటి సరఫరా ప్రారంభిస్తే, వృథాను అరికట్టడంతో పాటు కలుషిత జలాల నుంచి ఉపశమనం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

లీకేజీలు ఉన్న పైప్ లైన్లలో బయటి నుంచి మురుగు లోపలికి చేరుతుండగా, రెండో రోజు తొలి పావుగంట సేపు వచ్చే నీటిని వృథాగా వదిలి వేయాల్సి వస్తోందని గుర్తించిన అధికారులు లీకేజీలను అరికట్టడంపైనా దృష్టిని సారించారు. జలాశయాల్లోకి వస్తున్న వరదను మరింతగా అధ్యయనం చేసి, రోజూ నీటిని అందించే విధంగా చర్యలు చేపడతామని జలవనరులు, నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు.

More Telugu News