కిడ్నాప్: అబద్ధం చెప్పి తల్లిదండ్రులు, పోలీసులను పరుగులు పెట్టించిన బాలుడు!

  • నిజామాబాద్ జిల్లా గాంధారిలో ఘటన
  • పాఠ‌శాల‌కు వెళ్ల‌డం ఇష్టం లేని బాలుడు
  • తనను కొందరు కిడ్నాప్ చేశారని డ్రామా
  • నిజాన్ని తేల్చిన పోలీసులు

పాఠ‌శాల‌కు వెళ్ల‌డం ఇష్టం లేని ఓ బాలుడు త‌న‌ను దుండ‌గులు అప‌హ‌రించార‌ని చెప్పి త‌ల్లిదండ్రుల‌ను, పోలీసుల‌ను పరుగులు పెట్టించిన ఘ‌ట‌న‌ నిజామాబాద్ జిల్లా గాంధారిలో చోటు చేసుకుంది. ఇటీవ‌ల ఆ బాలుడి నాన‌మ్మ చ‌నిపోవ‌డం, ద‌స‌రా సెల‌వులు రావ‌డంతో ఆ బాలుడు చాలా రోజులు స్కూలుకి వెళ్ల‌లేదు. త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి బంధువుల ఇంట్లోనే ఆ బాలుడు కొన్ని రోజులు ఉన్నాడు.

మొన్న తిరిగి త‌మ గ్రామానికి వ‌చ్చిన ఆ బాలుడు ఇక పాఠ‌శాల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. బ‌డికి వెళ్ల‌మ‌ని త‌న త‌ల్లి బెదిరించ‌డంతో నిన్న ఉద‌యం ఇంటి నుంచి స్కూలుక‌ని వెళ్లాడు. కాగా, పాఠ‌శాల‌కు వెళ్ల‌డం ఇష్టంలేని ఆ బాలుడు తిరిగి ఇంటికి వ‌చ్చేసి, త‌న‌ను కొంద‌రు కిడ్నాప్ చేశార‌ని, కొట్టార‌ని చెప్పాడు. ఎలాగోలా త‌ప్పించుకుని వ‌చ్చేశాన‌ని అన్నాడు. దీంతో కంగారు ప‌డ్డ ఆ బాలుడి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఈ విష‌యాన్ని చెప్పారు.

ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ బాలుడి పాఠ‌శాల‌కు వెళ్లి ఆరా తీశారు. చివ‌రకు ఆ బాలుడి ప్రవర్తనపై అనుమానం కలగడంతో పోలీసులు తిరిగి విచారించ‌గా అస‌లు నిజం బ‌య‌టప‌డింది. ఆ బాలుడు క‌ట్టు క‌థ అల్లాడ‌ని పోలీసులు తేల్చారు. పిల్ల‌లు త‌ప్పు చేస్తే న‌చ్చ‌చెప్పాల‌ని, బెదిరించ‌కూడ‌ద‌ని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. 

More Telugu News