పాత ట్రెండ్ లోకి చంద్రబాబు.. విజయవాడలో ఆకస్మిక తనిఖీలు!

14-10-2017 Sat 09:27
  • ఏడాది తర్వాత ఆకస్మిక తనిఖీలను చేపట్టిన సీఎం
  • ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి తనిఖీలు
  • అధికారులకు పలు ఆదేశాలను జారీ చేసిన చంద్రబాబు

గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకస్మిక తనిఖీలతో అధికారుల గుండెల్లో చంద్రబాబు దడ పుట్టించిన సంగతి తెలిసిందే. ఈ సారి మాత్రం పరిపాలనపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి... ఆకస్మిక తనిఖీలకు దూరంగానే ఉన్నారు. ఏడాది క్రితం ఓ సారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇప్పుడు తాజాగా ఆయన పాత ట్రెండ్ ను కొనసాగించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి విజయవాడలోని పలు ప్రాంతాలను ఆయన తనఖీ చేశారు. గవర్నర్ పేటలోని ఆర్టీసీ-2 డిపో, కంట్రోల్ రూమ్ సమీపంలోని స్క్రాప్ పార్క్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

పాత బస్టాండు వద్ద ఉన్న పార్కులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పార్కు కాల్వ గట్టుపై పచ్చదనం, సుందరీకరణ పనులను పరిశీలించారు. ఆ తర్వాత బస్టాండులోకి వచ్చి తనిఖీలను కొనసాగించారు. ఇదే సమయంలో నగరంలోని పలు అభివృద్ధి పనులను కూడా ఆయన తనిఖీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.