metro rail: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. మెట్రో చార్జీలు వెరీ చీప్!

  • ఇతర నగరాల కంటే తక్కువగా ఉండేలా ప్రణాళికలు
  • గరిష్ఠంగా రూ.50కే సేవలు అందించాలని నిర్ణయం
  • ఆరేళ్ల క్రితం రూ.19గా నిర్ణయించిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం

హైదరాబాద్ మెట్రోను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం భాగ్యనగర వాసులకు శుభవార్త చెప్పాలని నిర్ణయించింది. ఇతర నగరాలతో పోలిస్తే మెట్రో చార్జీలు చాలా తక్కువగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముంబైలో మెట్రో టికెట్ గరిష్ఠ చార్జి రూ.110, చెన్నైలో రూ.70, ఉండగా ఢిల్లీ, బెంగళూరులో రూ.60 వసూలు చేస్తున్నారు.

వచ్చే నెలలో హైదరాబాద్‌లో మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇతర నగరాల కంటే తక్కువగా గరిష్ఠ చార్జిని కేవలం రూ.50కే ఖరారు చేసి, సేవలు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, నష్టాలను పూడ్చుకునేందుకు ప్రాజెక్టును చేపట్టిన ఎల్ అండ్ టీ-హెచ్ఎంఆర్ఎల్‌లకు నగరంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో రియాలిటీ ప్రాజెక్టుల కోసం 269 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా మెట్రో ప్రాజెక్టులన్నీ నష్టాల్లోనే నడుస్తున్నాయి. టికెట్ ధరల ద్వారా నష్టాలను పూడ్చుకోవడం దాదాపు అసాధ్యంగా మారుతోంది. దీంతో మెట్రో కారిడార్ వెంబడి షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు మెట్రో డెవలపర్‌కు అనుమతులు ఇవ్వడం ద్వారా నష్టాల నుంచి బయటపడేయాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. చార్జీలకు సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా గతనెలలోనే ప్రభుత్వం ఎల్‌ అండ్ టీని కోరింది. వచ్చే నెలలో ఇందుకు సంబంధించిన తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు.

విచిత్రం ఏమిటంటే, 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో చార్జీలు రూ.8 నుంచి రూ.19 మధ్య నిర్ణయించింది. గతేడాది మార్చిలో మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ మెట్రో చార్జీలు రూ.13 నుంచి రూ.25 మధ్య ఉంటాయని తెలిపారు. ఇప్పుడు దానిని రూ.20 నుంచి రూ.50 మధ్య ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

More Telugu News