Koramangala: తప్పదు మరి! మునుగుతున్న రోడ్లపై ప్రయాణం కోసం ఏకంగా బోటును కొనుక్కున్న కుటుంబం!

  • బెంగళూరును ముంచెత్తుతున్న వర్షాలు
  • ప్రయాణం కోసం బోటును కొనుక్కున్న వైనం
  • సోషల్ మీడియాలో వైరల్

వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లు మునిగిపోయి జీనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. బయటకు అడుగుపెట్టలేని స్థితి. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియదు.. కురిస్తే మునిగి రోడ్లపై నుంచి ఎలా రావాలో తెలియదు.. ఈ బాధలన్నీ ఎందుకని అనుకుందో ఏమో.. బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం ఏకంగా బోటునే కొనుగోలు చేసింది.

వర్షం పడి తరచూ రోడ్లపైకి మోకాలి లోతులో నీరు చేరుతుండడంతో బోటే శరణ్యమని భావించిన కోరమంగళంలోని ఓ కుటుంబం బోటును కొనుగోలు చేసింది. ఈ బోటుపై ఆ కుటుంబం ప్రయాణిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బోటులో వారు ప్రయాణించడమే కాదు, రెస్క్యూ ఆపరేషన్లు కూడా చేస్తున్నట్టు ఫేస్‌బుక్ యూజర్ సరిత పేర్కొంటూ అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.

కోరమంగళంలోని 4వ బ్లాక్‌కు చెందిన పాథాలజిస్ట్ షాలినీ మోదీ ఈ బోటును కొనుగోలు చేశారు. అత్యవసర సమయాల్లో స్థానికులు కూడా ఈ బోటును ఉపయోగించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి బెంగళూరును వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు రోడ్లు జలమయం అవుతున్నాయి. ట్రాఫిక్ జామ్‌లతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కొనేందుకు షాలినీ మోదీ ఈ వినూత్న ఆలోచన చేశారు. 

More Telugu News