అరుణారెడ్డి: తెలంగాణలో తొలిసారి.. వైట్ కాలర్ మోసాలకు పాల్పడుతున్న మహిళా రియల్టర్‌ పై పీడీ యాక్టు

  • రియల్టర్ అరుణారెడ్డిపై కేసు నమోదు
  • చంచల్ గూడ మహిళా జైలుకు తరలింపు 
  • గతంలో పలు కేసుల్లో నిందితురాలు

మోసాలకు పాల్పడుతున్న ఓ మహిళా రియల్టర్ పై తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పీడీ యాక్టు ప్రయోగించారు. అమాయక ప్రజలను మోసం చేసి, కోట్లాది రూపాయలు సంపాదించిన మహిళా రియల్టర్ అరుణారెడ్డిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ చెప్పారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో తొలిసారిగా వైట్ కాలర్ నేరస్తురాలిపై పీడీ యాక్టును ప్రయోగించడం జరిగిందని అన్నారు.

అరుణపై గతంలో పది కేసులు నమోదైనట్టు చెప్పారు. 2009 నుంచి 19 మందిని మోసం చేసి రూ.3.23 కోట్లు సంపాదించిందని, 2005లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఓ బ్యాంక్ ను మోసం చేసిందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ గతంలో ఆమెను అరెస్టు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అమాయక ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి వారికి చెల్లించకపోగా, బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తోన్న అరుణారెడ్డిపై కేసు నమోదు చేసి, చంచల్ గూడ మహిళా జైలుకు తరలించినట్టు మహేశ్ భగవత్ పేర్కొన్నారు.

More Telugu News