raghuveera reddy: మీకు ఉద్యోగాలు కావాలంటే ఈ పని చేయండి: నిరుద్యోగులకు రఘువీరా పిలుపు

  • మోదీ, చంద్రబాబు ప్రభుత్వాలను గద్దె దించండి
  • ప్రచారం చేసుకోవడం తప్ప... ఉద్యోగాలను కల్పించడం లేదు
  • నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పోరాడుతుంది

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వాలను గద్దె దింపాలంటూ యువతకు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఏపీలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని... వీరికి తోడు ప్రతి ఏటా చదువు పూర్తి చేసుకుంటున్న వారి సంఖ్య 6 లక్షలు దాటుతోందని చెప్పారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ శాఖల్లో 60 వేల మంది రిటైర్ అయ్యారని... దీనికితోడు వివిధ కారణాలతో వేలాది మంది ఉద్యోగాలను పీకేశారని తెలిపారు. వివిధ నివేదికల ప్రకారం రాష్ట్రంలో 2.13 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు ఒక పోస్టును కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ తీరుతో యువతలో నిరాశ నెలకొందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీని చేపట్టడం లేదని రఘువీరా విమర్శించారు. దేశ చరిత్రలో అతి తక్కువ ఉద్యోగాలను కల్పించిన ఘనత మోదీకే దక్కుతుందని అన్నారు. యూపీఏ హయాంలోనే అత్యధిక ఉద్యోగాలను కల్పించినట్టు గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. కేవలం రైల్వే శాఖలోనే 6 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా అంటూ మోదీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడమే తప్ప... చేసిందేమీ లేదని విమర్శించారు.

నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ అండగా నిలబడుతుందని... ఖాళీ పోస్టులను భర్తీ చేసేంత వరకు పోరాడుతుందని రఘువీరా అన్నారు. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ త్వరలోనే ఆందోళన కార్యక్రమాలను చేపడతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే ఈ కార్యక్రమాలకు యవతీయువకులు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని విన్నవించారు.  

More Telugu News