rains: అప్రమత్తం... తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షసూచన!

  • మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు
  • బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
  • ఇప్పటికే బలమైన ఉపరితల ఆవర్తనం
  • రాయలసీమలో దంచికొడుతున్న వర్షాలు

వచ్చే రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అది బలపడనుందని, ఇదే సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మరింతగా విస్తృతం కావచ్చని తెలిపారు. ఎగువన మహారాష్ట్ర, దిగువన తమిళనాడులో దట్టమైన మేఘాలు కమ్మి ఉన్నాయని, వీటి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

కాగా, గత రెండు రోజులుగా రాయలసీమలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, పంటకుంటలు పూర్తిగా నిండిపోయాయి. ఒక్క అనంతపురం జిల్లాలోనే 1200 ఎకరాల పంట నీట మునిగింది. గురు, శుక్రవారాల్లో సైతం వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. చెరువు కట్టలు బలహీనంగా ఉన్నాయని భావిస్తే, వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. వచ్చే రెండు రోజుల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

More Telugu News