ఏపీ యూత్ కాంగ్రెస్: అమిత్ షా కుమారుడు జైషా సంపాద‌న‌పై విచార‌ణ జ‌రిపించాలంటూ ఏపీ యూత్ కాంగ్రెస్ నిర‌స‌న‌

  • 2019లో ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారు
  • మేము అధికారంలోకి వస్తాం
  • అమిత్ షాను మోదీ త‌న బినామీగా పెట్టుకున్నారు

భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జైషా అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించాడని ది వైర్ వెబ్‌సైట్‌లో ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌చురించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ర్యాలీలు కొన‌సాగుతున్నాయి.

అమిత్ షా కుమారుడి సంపాద‌న‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని ఏపీ యూత్ కాంగ్రెస్ నాయ‌కులు పెద్ద రెడ్డి ప్ర‌దీప్‌, కిర‌ణ్‌, రాజ‌శేఖ‌ర్‌, ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మీసాల రాజేశ్వ‌ర‌రావు, గురునాథ త‌దిత‌రులు ఈ రోజు విజ‌య‌వాడ‌లో నిర‌స‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు చిన్న టర్నోవర్ తో నష్టాలలో ఉన్న అమిత్ షా కుమారుడి కంపెనీ ట‌ర్నోవ‌ర్ ఇప్పుడు ఉన్న‌ట్టుండి అంత‌గా ఎలా పెరిగిపోయింద‌ని ప్ర‌శ్నించారు.

అవినీతికి వ్య‌తిరేక‌మ‌ని చెప్పుకుంటోన్న ప్ర‌ధాని మోదీ.. అమిత్ షాను త‌న బినామీగా పెట్టుకున్నార‌ని యూత్ కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. 2019లో ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని, తాము అధికారంలోకి వ‌స్తామని అన్నారు. 

More Telugu News