rajan: రఘురాంను వదులుకోవడం ఇండియా చేసుకున్న నష్టం... భవిష్యత్తు ఆయనదే: రాజన్ పై నోబెల్ విజేత రిచర్డ్ థాలెర్

  • ఆయనకు త్వరలోనే నోబెల్ వస్తుంది
  • తిరిగి అధ్యాపక వృత్తిలోకి వచ్చినందుకు సంతోషం
  • ఆయన లేని లోటుతో ఇండియాకు జరిగే నష్టం తమకు లాభమన్న రిచర్డ్

ఇటీవల నోబెల్ ఆర్థిక బహుమతిని గెలుచుకున్న ప్రొఫెసర్ రిచర్డ్ థాలెర్, తనతో పోటీపడి కొద్దిలో నోబెల్ ను చేజార్చుకున్న రఘురాం రాజన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. "రఘు తిరిగి అధ్యాపక వృత్తిలోకి వచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన్ను వదులుకోవడం భారత్ చేసుకున్న నష్టం. నేడు నోబెల్ అతనికి రాలేదేమో. రేపు భవిష్యత్తు మాత్రం అతనిదే" అని అన్నారు.

ప్రస్తుతం థాలెర్, రాజన్ షికాగో యూనివర్శిటీలో భాగంగా ఉన్న బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో సహాధ్యాయులుగా ఉన్నారు. ఈ స్కూల్ నుంచే మూడేళ్ల పాటు సెలవు తీసుకున్న రాజన్ ఇండియాకు వచ్చి ఆర్బీఐ గవర్నర్ గా విధులు నిర్వహించారు. ఆయన మూడేళ్ల పదవీ కాలం పూర్తయిన తరువాత, దాన్ని పొడిగించేందుకు మోదీ సర్కారు అంగీకరించకపోవడంతో, రాజీనామా చేసిన రాజన్, తిరిగి షికాగో వెళ్లిపోయారు.

ఇక రాజన్ లేకపోవడంతో ఇండియాకు వచ్చే నష్టం తమ వర్శిటీకి లాభమని రిచర్డ్ థాలెర్ పేర్కొన్నారు. కాగా, ఇటీవల నోబెల్ ప్రాబబుల్స్ పేర్లు బయటకు వచ్చినప్పుడు రాజన్ పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ అవార్డు రాజన్ మిత్రుడైన థాలెర్ కు దక్కింది.

More Telugu News