parvati: పార్వతీదేవిని ప‌నిమ‌నిషిగా చూపించిన జ‌పాన్ వీడియో గేమ్‌... మండిపడుతున్న హిందువులు!

  • త‌ప్పుగా చూపించిన డిలైట్‌వ‌ర్క్స్ గేమ్ కంపెనీ
  • `ఫేట్/గ‌్రాండ్ ఆర్డ‌ర్‌` గేమ్‌లో కొత్త‌గా వ‌చ్చిన దేవ‌త పాత్ర‌
  • చేతిలో త్రిశూలంతో క‌నిపించిన పార్వ‌తీ దేవి

జ‌పాన్‌కి చెందిన డిలైట్‌వ‌ర్క్స్ సంస్థ రూపొందించిన `ఫేట్‌/గ‌్రాండ్ ఆర్డ‌ర్‌` ఆన్‌లైన్ గేమ్‌లో హిందువుల దేవ‌త పార్వ‌తీ దేవిని ప‌నిమ‌నిషిగా చూపించ‌డంపై హిందూ సంఘాలు మండిప‌డుతున్నాయి. వీలైనంత త్వ‌ర‌గా పాత్ర‌ను తొల‌గించాల‌ని ఆ సంస్థకు స‌మాచారం పంపిన‌ట్లు యూనివ‌ర్స‌ల్ హిందూ సొసైటీ అధ్య‌క్షుడు రాజన్ జేడ్ తెలిపాడు. గేమ్‌లో ప్ర‌ధాన పాత్ర‌కు పార్వతీ దేవి ప‌నిమ‌నిషిగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. అంతేకాకుండా ఈ గేమ్‌లో పార్వ‌తీ దేవి రూపురేఖ‌లు కూడా ఇబ్బందిక‌రంగా ఉన్నాయ‌ని రాజన్ పేర్కొన్నాడు. `వీడియో గేముల్లో హిందు దేవ‌త‌ల పాత్ర‌ల‌ను ఉప‌యోగించుకోవ‌డం హ‌ర్ష‌ణీయ‌మే... కానీ ఇలా త‌ప్పుగా చూపించ‌డం స‌బ‌బు కాదు` అని జెడ్ అన్నాడు.

ఈ గేమ్‌లో పార్వతీ దేవి పాత్ర చేతిలో త్రిశూలం ప‌ట్టుకున్న‌ట్లుగా చూపించారు. నిజానికి త్రిశూలం ఆమె భ‌ర్త శివుని చేతిలో ఉంటుంది. దీనిపై కూడా హిందూ సంస్థ‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. అలాగే ఆమె వాహ‌నంగా `నంది`ని చూపించారు. అది కూడా శివునికే చెందుతుంది. ఇలా త‌ప్పుగా చూపించ‌డం వ‌ల్ల హిందువులు కాని వారికి పురాణాలు అర్థం చేసుకోవ‌డంలో అయోమ‌యం క‌లుగుతుందని రాజన్ తెలిపారు.

More Telugu News