bangalore: అమ్మ ప్రేమకు ప్రతిరూపం... బెంగ‌ళూరులో ప్రారంభ‌మైన `త‌ల్లి పాల నిధి`!

  • 130 మి.లీ.ల త‌ల్లి పాల‌ ధ‌ర రూ. 200
  • ఏడు నెల‌ల‌ వ‌య‌సులోపు పిల్ల‌ల‌కే
  • ప్ర‌భుత్వాసుప‌త్రిలో జ‌న్మించిన బిడ్డ‌ల‌కు ఉచితం

పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత దాదాపు సంవ‌త్స‌రం పాటు త‌ల్లి పాలు అంద‌జేస్తే భ‌విష్య‌త్తులో ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు రావు. కానీ కొన్ని సార్లు త‌ల్లి పాలు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు. అలాంటి వారి కోస‌మే `త‌ల్లి పాల నిధి` పేరుతో బెంగ‌ళూరులో ఓ సంస్థను ప్రారంభించారు. ప్రముఖ వైద్యాల‌యం - ఓ ప్ర‌భుత్వేత‌ర సంస్థ సంయుక్తంగా మ‌ద‌ర్ థెరిసా రోడ్డులో దీన్ని ఏర్పాటు చేశాయి.

ఏడు నెల‌ల లోపు వ‌య‌సున్న పిల్ల‌ల‌కు ఈ నిధి ద్వారా త‌ల్లి పాలు అంద‌జేస్తున్నారు. 130 మి.లీ.ల త‌ల్లి పాల ధ‌ర‌ను రూ. 200గా నిర్ణయించిన‌ట్లు నిర్వాహ‌క సంస్థ ప్ర‌తినిధి డాక్ట‌ర్ ర‌ఘునాథ మ‌ల్ల‌య్య తెలిపారు. ప్ర‌భుత్వాసుప‌త్రిలో జ‌న్మించిన పిల్ల‌ల‌కు పాల‌ను ఉచితంగా అంద‌జేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇత‌ర ఆసుప‌త్రుల వారికి డాక్ట‌ర్ల సిఫార‌సు మేరకు ఇస్తున్నామ‌ని అన్నారు. పాలు అవ‌స‌ర‌మైన వారికి ఈ కేంద్రం నుచి గ‌మ్య‌స్థానానికి రెండు గంట‌ల వ్య‌వ‌ధిలోనే స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని తెలిపారు.

త‌ల్లి పాల‌ను ఆరు నెల‌ల వ‌ర‌కు భ‌ద్రప‌ర‌చ‌వ‌చ్చు. వాటిని సాధార‌ణ ఉష్ణోగ్ర‌త వ‌ద్ద పిల్ల‌ల‌కు ప‌ట్టించాలి. ఈ కేంద్రానికి పాలిచ్చేందుకు చాలా మంది త‌ల్లులు ఆస‌క్తి చూపించార‌ని ర‌ఘునాథ మ‌ల్ల‌య్య తెలిపారు. వారంద‌రికీ సీసాలు ఇచ్చామ‌ని, అవి నిండే వ‌ర‌కు ఫ్రిజ్‌లో భ‌ద్ర‌ప‌రిచి, నిండిన త‌ర్వాత త‌మ సిబ్బందికి అంద‌జేయాల‌ని ఆయ‌న వివ‌రించారు. ఇప్ప‌టికే ఢిల్లీలో ప్రారంభించిన త‌ల్లి పాల‌ కేంద్రం 700 లీట‌ర్ల పాల‌ను స‌మీక‌రించింద‌ని ఆయ‌న చెప్పారు. డబ్బులిచ్చి పాలను కొనబోమని స్పష్టీకరించారు. ఈ కేంద్రం నిర్వహణలో లాభాపేక్ష లేదని, నిర్వహణ వ్యయం వరకూ మాత్రమే విక్రయాలు ఉంటాయని పేర్కొన్నారు. తల్లి పాల దానం గురించి ప్రచారాన్ని చేపడతామని తెలిపారు.

More Telugu News