india: ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాళ్ల దాడి... భయంతో బెంబేలెత్తిన ఆటగాళ్లు!

  • రెండు నెలల వ్యవధిలో ఆసీస్ ఆటగాళ్లపై రెండో దాడి
  • పగిలిన బస్సు అద్దం
  • భయపడ్డామన్న ఆరోన్ ఫించ్
  • భద్రత పెంచామన్న కేంద్రం

నిన్న గువహటిలో భారత క్రికెట్ జట్టుపై టీ-20లో ఘన విజయం సాధించి, హోటల్ కు వెళుతున్న సమయంలో ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన రాళ్ల దాడి తీవ్ర కలకలం రేపింది. రెండు నెలల వ్యవధిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎదుర్కొన్న రాళ్లదాడి ఘటనల్లో ఇది రెండోది. సెప్టెంబరులో చిట్టగ్యాంగ్ లో బంగ్లాదేశ్ తో ఓ టెస్టు మ్యాచ్ అనంతరం వెళుతున్నప్పుడూ ఇలాగే రాళ్లు విసిరారు.

 "ఓ బలమైన రాయి వచ్చి మా బస్సు అద్దాన్ని పగులగొట్టింది. చాలా భయం వేసింది" అని ఆరోన్ ఫించ్ పగిలిన అద్దం ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. ఘటన తరువాత, మరింత రక్షణ మధ్య ఆటగాళ్లను తరలించారు. ఆపై రాష్ట్ర మంత్రి హేమంత్ విశ్వ శర్మ స్పందిస్తూ, ఆస్ట్రేలియా జట్టుపై రాళ్లదాడికి చింతిస్తున్నట్టు తెలిపారు. దీనిపైనే కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ స్పందిస్తూ, ఇది భద్రతాపరమైన లోపం ఎంతమాత్రమూ కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడామని, ఆటగాళ్ల భద్రత తమకు ఎంతో ముఖ్యమైన విధని అన్నారు. కాగా, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఓ క్రికెట్ బాల్ సైజులో ఉన్న రాయి అద్దాన్ని తాకిందని 'క్రికెట్ ఆస్ట్రేలియా' పేర్కొంది.

More Telugu News