kollywood: కేసు నమోదు కావడంతో అజ్ఞాతంలోకెళ్లిన కోలీవుడ్ సినీ నటుడు సంతానం!

  • కాంట్రాక్టర్ తో కలిసి కల్యాణ మండపం నిర్మించాలని భావించిన సంతానం
  • నిర్మాణం దశలో భేదాభిప్రాయాలు
  • ప్రాజక్టు నుంచి వైదొలగి పెట్టుబడి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసిన సంతానం
  • వాగ్వాదం, ఘర్షణ...గాయాలతో ఆసుపత్రి పాలైన సంతానం

కోలీవుడ్ లో హాస్యనటుడిగా రాణించి, హీరో స్థాయికి ఎదిగిన ప్రముఖ నటుడు సంతానం అజ్ఞాతంలోకి వెళ్లడం వివాదాస్పదమవుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... సినీ నటులు తమ ఆదాయాన్ని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంటారన్న సంగతి తెలిసిందే. సంతానం కూడా అలాగే ఒక కాంట్రాక్టర్ (చెన్నై, వలసరవాక్కం, చౌదరి నగర్ కి చెందిన షణ్ముగసుందరం) తో కలసి కుండ్రత్తూర్‌ సమీపంలోని కోవూర్‌ ప్రాంతంలో కల్యాణ మండపం నిర్మించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇందులో తన భాగం మొత్తానికి సంబంధించిన డబ్బును నిర్మాణానికి ముందే ఆయనకు సంతానం ఇచ్చేశాడు.

 అయితే నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో దాని నుంచి ఆయన వైదొలిగాడు. దీంతో కాంట్రాక్టర్ కొంత డబ్బు తిరిగి సంతానంకు చెల్లించాడు. మిగతా మొత్తాన్ని ఎప్పుడు అడిగినా ఇవ్వకుండా తప్పించుకుంటుండడంతో తన మేనేజర్ రమేష్ తో కలిసి సంతానం నేరుగా ఆయన కార్యాలయానికి వెళ్లాడు. ఈ సమయంలో అక్కడ షణ్ముగసుందరంతో పాటు, ఆయన మిత్రుడు, స్థానిక బీజేపీ నాయకుడు, న్యాయవాది ప్రేమానంద్‌ కూడా అక్కడే ఉన్నారు. వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి, ఘర్షణకు దారితీసింది. ఆ గొడవలో ముగ్గురూ గాయపడ్డారు.

దీంతో వెంటనే నటుడు సంతానం స్థానిక వడపళనిలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. అదే ఆసుపత్రిలో షణ్ముగసుందరం కూడా జాయిన్ అయ్యారు. ఇంతలో ప్రేమానంద్ గాయపడ్డాడని తెలుసుకున్న కార్యకర్తలు, ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. అనంతరం స్థానిక స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదు చేసి, స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు సంతానంపై మూడు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్న సంతానం అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. ఆయనను త్వరలో అరెస్టు చేసే అవకాశముందని సమాచారం. కాగా, ఈ ఘర్షణ వివాదం కోలీవుడ్ లో కలకలం రేపింది. 

More Telugu News