america: అమెరికా ప్ర‌థ‌మ మ‌హిళను తానే అన్న ట్రంప్ మొద‌టి భార్య‌.... గ‌ట్టిగా స‌మాధానం చెప్పిన మూడో భార్య‌

  • `రైజింగ్ ట్రంప్‌` పుస్త‌కం రాసిన ఇవానా ట్రంప్‌
  • పుస్త‌కావిష్క‌ర‌ణ వేడుక‌లో తానే ప్ర‌థ‌మ మ‌హిళన‌ని వ్యాఖ్య‌
  • పుస్త‌కం అమ్మ‌కాల కోసం ఇలా పేరు వాడుకోవ‌ద్ద‌ని చెప్పిన మెలానియా

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మొద‌టి భార్య ఇవానా‌, ప్రస్తుత మూడో భార్య మెలానియా ట్రంప్‌ల మ‌ధ్య చిన్న మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. ఇటీవ‌ల తాను రాసిన `రైజింగ్ ట్రంప్‌` పుస్త‌కావిష్క‌ర‌ణ వేడుక‌లో ట్రంప్‌తో త‌న‌కున్న సుదీర్ఘ సంబంధాల‌ను దృష్టిలో ఉంచుకుని చూస్తే తానే అమెరికా ప్ర‌థ‌మ మ‌హిళ అవుతాన‌ని ఇవానా వ్యాఖ్యానించింది.

`నా ద‌గ్గ‌ర వైట్‌హౌస్ డైరెక్ట్ నంబ‌ర్ ఉంది. కానీ నేను అత‌నికి కాల్ చేయాల‌నుకోట్లేదు. ఎందుకంటే అక్క‌డ ఉన్న మెలానియా ఈర్ష్య‌గా ఫీల‌వుతుంది. ఎందుకంటే... ఎలా చూసినా అమెరికా ప్ర‌థ‌మ మ‌హిళ‌ను నేనే క‌దా!` అంటూ హాస్యం పండించింది.

ఈ వ్యాఖ్య‌ల‌పై మెలానియా ట్రంప్ కూడా త‌న‌దైన రీతిలో స్పందించింది. త‌న ప్ర‌తినిధి స్టీఫానీ గ్రేషామ్ ద్వారా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అందులో ఆమె ప్రతినిధి మెలానియా గురించి పేర్కొంటూ, వైట్‌హౌస్‌ను బ్యారెన్ (మెలానియా కొడుకు), ట్రంప్‌లకు నివాసంగా మెలానియా మార్చార‌ని, అక్క‌డ నివ‌సించ‌డం అమెరికా ప్ర‌థ‌మ మ‌హిళ‌గా ఆమెకు గ‌ర్వకారణమని, ఆ హోదాలో ఆమె బాలల ప్రగతికి తోడ్పడతారు కానీ, పుస్త‌కాల‌ను అమ్ముకోవడానికి కాదని తెలిపారు. కాగా, ట్రంప్‌కి ముగ్గురు భార్య‌లు. ఇవానా ట్రంప్‌తో ముగ్గురు పిల్ల‌లు డొనాల్డ్ జూనియ‌ర్‌, ఇవాంకా, ఎరిక్ ఉన్నారు.

More Telugu News