ka paul: వందల కోట్ల విలువైన ఆస్తుల వివాదం.. కేఏ పాల్ కు షాక్

  • కేఏ పాల్ కు, తమ్ముడి భార్యకు మధ్య వివాదం
  • రాణికి ఆస్తులను అప్పగించాలంటూ తహశీల్దార్ నోటీసులు
  • రేపు 10 గంటలకు అప్పగించాలంటూ ఉత్తర్వులు

ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ కు విశాఖపట్నం అర్బన్ తహసీల్దార్ షాక్ ఇచ్చారు. కేఏ పాల్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న గమ్ సొసైటీకీ సంబంధించిన ఆస్తులను ఆయన సోదరుడు దివంగత డేవిడ్ రాజు భార్య ఎస్తేరు రాణికి అప్పగించాలంటూ తహసీల్దార్ నాగభూషణం నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఇరు పార్టీలకు నోటీసులు ఇచ్చారు.

గమ్ సొసైటీకి వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులకు సంబంధించి అన్నదమ్ములు ఇద్దరి మధ్య వివాదం నడిచింది. ఈ నేపథ్యంలో, డేవిడ్ రాజు హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆస్తుల కోసం డేవిడ్ రాజు భార్య, ఆయన కుమారులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే, ఈ ఆస్తులన్నీ కేఏ పాల్ కే చెందుతాయని, వాటిని ఆయనకే అప్పగించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. దీంతో, ఈ ఏడాది మే 16న గమ్ సొసైటీ ఆస్తులను కేఏ పాల్ కు అప్పగించారు. దీన్ని సవాల్ చేస్తూ డేవిడ్ రాజు భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పరిస్థితుల్లో విశాఖ ఆర్డీవో కేఏ పాల్ కు నోటీసులు జారీ చేశారు.  కేఏ పాల్ తన అధీనంలో ఉన్న ఆస్తులను అర్బన్ ఎమ్మార్వోకు స్వాధీనం చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ ఆస్తులను ఎస్తేరు రాణీకి అప్పగించవలసి ఉందని  ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు  ఆస్తులను అప్పగించాలని నోటీసులో  పేర్కొన్నారు. 

More Telugu News