టాటా టెలీ సర్వీసెస్ మూసివేత... టాటా గ్రూప్ నిర్ణయంతో రోడ్డున 5 వేల మంది!

09-10-2017 Mon 13:23
  • 21 ఏళ్లుగా వైర్ లైన్ సేవలందిస్తున్న టాటా టెలీ సర్వీసెస్
  • వైర్ లైన్ సర్వీసుల సంఖ్య కనిష్ఠానికి
  • నష్టాలను భరించలేక సంస్థ మూసివేత!

గడచిన 21 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఫోన్ సర్వీస్ వెంచర్ టాటా టెలీ సర్వీసెస్ ను మూసి వేయాలని టాటా గ్రూప్ నిర్ణయించుకుంది. వైర్ లైన్ సేవలకు ప్రాధాన్యత తగ్గిపోవడం, ఫోన్ల సంఖ్య కనిష్ఠానికి చేరడంతోనే సంస్థను నిర్వహించలేని పరిస్థితుల్లో నష్టాలను ఇక భరించలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇక ఈ మూసివేత ప్రక్రియలో భాగంగా 5 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనుండగా, వీరికి మూడు నుంచి ఆరు నెలల నోటీసులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తమంతట తాముగా ముందే సంస్థను వీడే వారికి సెవరెన్స్ ప్యాకేజీలను కూడా టాటా టెలీ సర్వీసెస్ ఆఫర్ చేస్తోంది. కొంతమంది ఉద్యోగులను ఇతర గ్రూప్ కంపెనీలకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని, రిటైర్ మెంట్ కు దగ్గరగా ఉన్న వారికి స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశాన్ని ఇస్తున్నామని సంస్థ పేర్కొంది.

కాగా, నైపుణ్యాలున్నాయని భావిస్తున్న వారిని మాత్రమే ఇతర కంపెనీల్లోకి తీసుకుని, మెజారిటీ ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంవత్సరం మార్చిలో సంస్థ ఆర్థిక ఫలితాలు ప్రకటించిన నాటికి సంస్థలో 5,101 మంది ఉద్యోగులు ఉండగా, వీరిలో దాదాపు 5 వేల మంది వరకూ ఉద్యోగాలను కోల్పోనున్నారు.