warner: కుల్దీప్ యాదవ్ సంధించిన బంతికి నా మైండ్ బ్లాంక్ అయింది: ఆరోన్ ఫించ్

  • కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో స్వీప్ ఆడాలి
  • చివరి నిమిషంలో స్టాన్స్ మార్చుకున్నాను
  • మైండ్ బ్లాంక్ అయింది

టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వేసిన బంతికి తన మైండ్ బ్లాంక్ అయిందని ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ తెలిపాడు. రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఆరంభంలోనే వార్నర్ వెనుదిరగగా, మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ ధాటిగా ఆడాడు. వార్నర్, మ్యాక్స్ వెల్ తడబడగా, ఫించ్ మాత్రం 30 బంతుల్లోనే నాలుగు ఫోర్ల సాయంతో 42 పరుగులు చేశాడు.

ఈ దశలో టీమిండియా చైనా మన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వేసిన బంతికి బోల్తాపడ్డాడు. దానిపై మాట్లాడుతూ, కుల్దీప్ బౌలింగ్ లో స్వీప్ షాట్ ను ఎంచుకోవడం ఉత్తమమని భావించానని చెప్పాడు. అలాగే అతని బంతులను ఆడానని గుర్తుచేశాడు. అయితే కుల్దీప్ తనకు సంధించిన బంతిని తొలుత స్వీప్ షాట్ ఆడాలని భావించానని చెప్పాడు.

అయితే చివరి నిమిషంలో స్టాన్స్ మార్చుకుని, బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశానని చెప్పాడు. స్టాన్స్ మార్చుకునే క్రమంలో మెలికలు తిరుగుతున్న బంతిని ఆడాల్సిన సమయంలో తన మైండ్ బ్లాంక్ అయిపోయిందని అన్నాడు. అందుకే వేగంగా స్పందించలేదని చెప్పాడు. అంతలో బంతి మెలికలు తిరుగుతూ వికెట్లను గిరాటేసిందని ఫించ్ తెలిపాడు.

ఆ తరువాత హెన్రిక్స్, క్రిష్టియాన్, పేన్, కల్టర్ నైల్ వరుసగా అవుటైన సంగతి తెలిసిందే. అనంతరం వర్షం కురవడంతో 118 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. తరువాత డక్ వర్త్ లూయీస్ పధ్ధతిలో భారత్ కు ఆరు ఓవర్లలో 46 పరుగుల విజయలక్ష్యం నిర్దేశించారు. రోహిత్ అవుటైనప్పటికీ ధావన్, కోహ్లీ ధాటిగా ఆడి సునాయాసంగా విజయం సాధించారు. దీంతో తొలి టీ20లో టీమిండియా విజయం సాధించి ముందంజవేసింది. రేపు రెండో టీ20 జరగనుంది. 

More Telugu News