ఇల్లు ఖాళీ చేయమన్న ఓనర్ ను చెప్పుతో కొట్టిన ఎమ్మెల్సీ!

09-10-2017 Mon 10:48
  • ఎమ్మెల్సీ దౌర్జన్యం
  • నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహిళ
  • తన నివాసం ముందు ఆందోళనకు దిగిన మహిళ
ఇల్లు ఖాళీ చేయమన్న ఇంటి ఓనర్ పై ఎమ్మెల్సీ దౌర్జన్యానికి దిగిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదులోని నాంపల్లిలో ఒక ఎన్నారై నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇంటిని నాంపల్లి ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటిని ఖాళీ చేయమని ఎన్నారై ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ఆయన పట్టించుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో ఆమె నేరుగా ఎమ్మెల్సీ వద్దకెళ్లి ఇల్లు ఖాళీ చేయాలని సూచించారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్సీ ఫరూఖ్ దిక్కున్న చోట చెప్పుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ అయిన తనను ఎవడు ఖాళీ చేయిస్తాడో చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. అంతే కాకుండా ఆమెను చెప్పుతో కొట్టారు. దీంతో ఆమె నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, తన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.