up police: హెల్మెట్ లేకుండా దొరికిపోయిన భర్తలకు భార్యలతో వినూత్న సన్మానం చేయించిన యూపీ పోలీసులు!

  • హెల్మెట్ లేకుండా దొరికిపోయిన వందలాది మంది
  • వారి భార్యలను పిలిపించిన పోలీసులు
  • తమ డబ్బుతో హెల్మెట్లు కొని బహూకరణ
  • భార్యలతోనే తొడిగించి వెరైటీ సన్మానం

రహదారి నిబంధనలను పాటించకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు లోనవుతున్న ఘటనలపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు వినూత్నంగా స్పందించారు. దేశంలో నమోదైన రోడ్డు ప్రమాదాల్లో 84 శాతం యూపీలోనే ఉండటం, వాటిల్లో కూడా 55 శాతం హెల్మెట్ లేక పోవడమే కారణంగా తేలడంతో, పోలీసు అధికారులు వెరైటీగా ఆలోచించారు. హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపిన వారిని పట్టుకుని వారికి ఫైన్ విధించకుండా, వారి జీవిత భాగస్వాములను పిలిపించారు.

ఆపై తమ డబ్బులతో హెల్మెట్లు కొనిచ్చి, నడిరోడ్డుపైనే భార్యలతో వాటిని తొడిగించి, వెరైటీగా సన్మానించారు. కర్వాచౌత్ సందర్భంగా, తమ భర్తలు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని వివాహితులైన వారంతా కోరుకుంటారన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ పర్వదినం సందర్భంగా తమ ప్రాణాలు ఎంత విలువైనవన్న విషయాన్ని భార్యలతో చెప్పించామని, సొంత నిధులను వెచ్చించి వందలాది మందికి హెల్మెట్లను బహూకరించామని లక్నో ఎస్పీ దీపక్ కుమార్ వెల్లడించారు. వారితో ఇకపై హెల్మెట్లు లేకుండా ప్రయాణించబోమని ప్రమాణం చేయించినట్టు తెలిపారు.
 

More Telugu News