ganguly: సౌరవ్ త్యాగం చెయ్యడం వల్లే ధోనీ గొప్ప బ్యాట్స్ మన్ గా త్వరగా పేరు తెచ్చుకున్నాడు!: సెహ్వాగ్

  • సెహ్వాగ్, ధోనీల కోసం తన స్థానాన్ని త్యాగం చేసిన గంగూలీ
  • బ్యాటింగ్ ఆర్డర్ లో ధోనీని మూడో నంబర్ లో పంపిన గంగూలీ
  • ధోనీ బ్యాట్స్ మన్ గా రాణించడం వెనుక గంగూలీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ గొప్ప బ్యాట్స్‌ మన్‌ అంటూ నీరాజనాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. సమయోచితంగా బ్యాటింగ్ చేస్తాడంటూ విశ్లేషకులు అతనిని ఆకాశానికెత్తడం సాధారణం. కానీ ధోనీ గొప్ప బ్యాట్స్ మన్ గా ప్రఖ్యాతిగాంచడం వెనుక దిగ్గజ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ త్యాగమే కారణమని డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ తెలిపాడు.

 గంగూలీ కెప్టెన్ గా ఉన్న సమయంలో వర్ధమాన ఆటగాళ్లను ప్రోత్సహించడం, సరికొత్త ప్రయోగాలు చేయడం విరివిగా జరిగింది. ఆ సమయంలోనే భారత్ విదేశాల్లో తిరుగులేని విజయాలు సాధించడానికి అలవాటు పడింది. ఆ దశలో ధోనీ కోసం గంగూలీ తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ను త్యాగం చేశాడని సెహ్వాగ్ చెప్పాడు.

ఓపెనర్లు చక్కటి భాగస్వామ్యం నమోదు చేయకపోతే పించ్ హిట్టర్ లు పఠాన్ లేదా ధోనీలలో ఒకర్ని మూడో నెంబర్ లో పంపించాలని నిర్ణయించామని చెప్పాడు. ఓపెనర్లు రాణించినా, ధోనీని గంగూలీ మూడో నెంబర్ లో బ్యాటింగ్ కు పంపేవాడని, దీంతోనే ధోనీ అవకాశాల్ని వినియోగించుకున్నాడని చెప్పాడు. ఆ రోజు అలాంటి అవకాశం ధోనీకి కల్పించి ఉండకపోతే గొప్ప బ్యాట్స్ మన్ గా నిరూపించుకునేందుకు ధోనీకి మరింత సమయం పట్టేదని, దిగ్గజంగా పేరుతెచ్చుకోవడం కష్టమయ్యేదని సెహ్వాగ్ తెలిపాడు.

కాగా, గంగూలీ తన బ్యాటింగ్ ఆర్డర్ ను రెండు సార్లు మార్చుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఓపెనర్ గా ఉన్న గంగూలీ తొలిసారి సెహ్వాగ్ కోసం మూడో నంబర్ ఆటగాడయ్యాడు. తరువాత ధోనీ కోసం ఐదో నెంబర్ ఆటగాడయ్యాడు. రాహుల్ ద్రవిడ్ కూడా తన స్థానాన్ని త్యాగం చేసి పలు సందర్భాల్లో ఓపెనర్ గా, కీపర్ గా వచ్చిన సంగతి తెలిసిందే. 

More Telugu News