భర్తపై శశికళ నిర్లక్ష్యం... నటరాజన్ ను వదిలి రాజకీయాలు!

08-10-2017 Sun 08:57
  • భర్తకు అనారోగ్యం పేరిట పెరోల్
  • ఆసుపత్రిలో కేవలం గంటన్నరే
  • భర్త గదిలోకి కూడా వెళ్లని శశి!
  • మిగతా సమయమంతా రాజకీయమే
తన భర్తకు అనారోగ్యంగా ఉన్న కారణంగా, ఆయనకు తన సేవల అవసరం ఉందని, 15 రోజులు పెరోల్ కావాలని కోరి, 5 రోజుల పెరోల్ పై బయటకు వచ్చిన శశికళ, కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి, రాజకీయాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆసుపత్రిలో ఉండి భర్త నటరాజన్ కు సేవలు చేసుకుంటానని కోర్టుకు చెప్పిన శశికళ, కేవలం గంటన్నర పాటు మాత్రమే ఆసుపత్రిలో గడిపారు. అక్కడ కూడా ఆమె నటరాజన్ ఉన్న గది వైపు కూడా వెళ్లలేదని, కేవలం డాక్టర్లతో మాత్రం మాట్లాడారని తెలుస్తోంది.

 ఇక శుక్రవారం నాడు పెరోల్ పై జైలు గోడలు దాటి బయటకు వచ్చిన శశికళ, శనివారం మధ్యాహ్న సమయంలో ఓ రెండు గంటలు మినహా మిగతా కాలాన్ని రాజకీయాలకే వెచ్చించినట్టు సమాచారం. తనకు స్వాగతం చెప్పేందుకు వచ్చిన వారిని పలకరించిన శశి, తన వర్గం అన్నాడీఎంకే నేతలను రహస్యంగా పిలిపించుకుని మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎటువంటి రాజకీయ సమావేశాలు పెట్టుకోరాదన్న కోర్టు నియమాలను ఆమె ధిక్కరించిందని తమిళ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీపై పట్టును తన చేతుల్లోనే ఉంచుకోవాలంటే తీసుకోవాల్సిన చర్యలపై ఆమె తన అనుయాయులతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కోర్టు సోమవారం నాడు  తీర్పును వెలువరించనుండగా, వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏం చేయాలన్న విషయమై న్యాయవాదులతోనూ ఆమె సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలన్న ఆలోచన శశికళలో కనిపిస్తున్నట్టు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించాయి.