Shiv Sena: ఎన్డీయేతో పొత్తుకు శివసేన రాంరాం.. సమయం ఆసన్నమైందన్న ఆ పార్టీ చీఫ్

  • బీజేపీతో తెగదెంపులకు సిద్ధమవుతున్న శివసేన
  • గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జీఎస్టీ తగ్గించారని ఆరోపణ
  • గత ప్రభుత్వమే మేలని ప్రశంసలు

కేంద్రంలోని ఎన్డీయేతో మూడేళ్లుగా కలిసి ముందుకు సాగుతున్న శివసేన దానితో తెగదెంపులు చేసుకోనుందా? శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయేతో కలిసి ముందుకు సాగాలా? వద్దా? అనే విషయంలో తుది నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని అన్నారు. తాము ప్రజా సేవకే కట్టుబడి ఉన్నామని, అలాగే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

అయితే తామెరికీ అల్టిమేటం ఇవ్వాలనుకోవడం లేదని, కూటమితో తెగదెంపులు చేసుకోవాలనుకున్నప్పుడు అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్ చేసిన శ్లాబ్ మార్పుల ప్రకటన దీపావళి కానుక కాదన్న ఉద్ధవ్ మరిన్ని మార్పులు అవసరమని తేల్చి చెప్పారు.

తాను ఆర్థికవేత్తను కాదన్న ఆయన గత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. గతంలోని ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండేదన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం తన నిర్ణయాలను పదేపదే మార్చుకుంటోందని ఎద్దేవా చేశారు. గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే 27 ఉత్పత్తులపై పన్నును తగ్గించినట్టు ఉద్ధవ్ థాకరే ఆరోపించారు.

More Telugu News