pahlaj nihalani: ప‌హ్లాజ్ నిహలానీ గురించి నేనెప్పుడూ మాట్లాడ‌లేదు: స‌్మృతీ ఇరానీ

  • క‌ర‌ణ్ జొహార్‌తో మాట్లాడిన కేంద్ర మంత్రి
  • భార‌త ఆర్థిక శిఖరాగ్ర స‌మావేశంలో పాల్గొన్న క‌ర‌ణ్‌, ఇరానీ
  • క‌ర‌ణ్ మంచివాడ‌ని పొగిడిన స‌మాచార ప్ర‌సారాల శాఖ మంత్రి

సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ మాజీ చైర్మ‌న్ ప‌హ్లాజ్ నిహ‌లానీ గురించి తానెప్పుడూ, ఎక్క‌డా మాట్లాడ‌లేద‌ని కేంద్ర స‌మాచార, ప్ర‌సారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. ఆయ‌న ఎలాంటి సినిమాలు తీసినా, వ‌య‌సులో పెద్ద‌వారు కాబ‌ట్టి ఆయ‌న‌ను గౌర‌వించామ‌ని ఆమె పేర్కొన్నారు. అలాగే సీబీఎఫ్‌సీ లాంటి సంస్థ‌ల‌ను చ‌ట్ట‌ప‌రంగా సుప‌రిపాల‌న‌లో ఉప‌యోగ‌ప‌డే సంస్థ‌లుగానే చూస్తామ‌ని ఆమె తెలియ‌జేశారు. న్యూఢిల్లీలో జ‌రిగిన భార‌త ఆర్థిక శిఖ‌రాగ్ర స‌మావేశంలో నిర్మాత క‌ర‌ణ్ జొహార్‌తో ఆమె మాట్లాడారు. ఇటీవ‌ల ప‌హ్లాజ్ నిహ‌లానీ స్థానంలో సీబీఎఫ్‌సీ చైర్మ‌న్‌గా గీత ర‌చ‌యిత ప్ర‌సూన్ జోషిని నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నియామ‌కం వెన‌క స్మృతీ ఇరానీ హ‌స్తం ఉంద‌ని అప్ప‌ట్లో వార్తలు వ‌చ్చాయి.

ఈ స‌మావేశంలో `మై నేమ్ ఈజ్ ఖాన్‌` సినిమా సమయంలో ఉత్పన్నమైన స‌మ‌స్య‌ల గురించి క‌ర‌ణ్ ఆమెకు వివ‌రించాడు. అప్ప‌ట్లో గుజ‌రాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చొర‌వ తీసుకుంటే గానీ ఈ సినిమా సమస్య తీరలేదని క‌ర‌ణ్ చెప్పాడు. 'సమస్య మహారాష్ట్ర నుంచి గుజ‌రాత్ కు వ్యాపించడంతో అప్పుడు ముఖ్యమంత్రి మోదీని సంప్రదించాం. పది నిమిషాల్లో సమస్య పరిష్కారమైంది. అందుకే కొన్ని సినిమాల‌ విష‌యంలో ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవాలి' అని ఆయ‌న కోరాడు. అలాగే ఇటీవ‌ల సినిమాల్లో బంధుప్రీతికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా పేర్కొంటూ క‌ర‌ణ్‌పై వ‌స్తున్న వివాదాలపై కూడా స్మృతీ ఇరానీ స్పందించారు. క‌ర‌ణ్ అలాంటి వాడు కాద‌ని, ప్ర‌తి ఒక్క‌రినీ చాలా గౌర‌వంగా చూస్తాడ‌ని, తాను ఇండ‌స్ట్రీలో ఉన్నపుడే అత‌ని మంచిత‌నం గురించి తెలిసింద‌ని స్మృతీ ఇరానీ తెలిపారు.

More Telugu News