yoga mat: ఆన్‌లైన్‌లో యోగామ్యాట్ ఆర్డర్ చేస్తే.. రెండున్నర కోట్ల విలువైన డ్రగ్స్ వచ్చాయి!

  • అమెరికాలోని యార్క్ కౌంటీలో ఘటన
  • పార్సిల్ విప్పి అవాక్కయిన మహిళ
  • రెండు సంచుల్లో 20 వేల పిల్స్  

ఆన్‌లైన్‌లో యోగా మ్యాట్ ఆర్డర్ చేసిన మహిళకు రూ.రెండు కోట్ల విలువైన 20వేల నార్కోటిక్ పిల్స్ వచ్చిన ఘటన అమెరికాలోని యార్క్ కౌంటీలో చోటుచేసుకుంది. పార్సిల్ విప్పి చూసిన ఆమె అందులో నార్కోటిక్ పిల్స్ ఉండడం చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాక్‌హిల్‌లో నివాసముండే మహిళ యోగా మ్యాట్ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. రెండు రోజుల తర్వాత డెలివరీ బాయ్ వచ్చి ఆమె చేతిలో ఓ పార్సిల్ పెట్టాడు. విప్పి చూసిన ఆమె అందులో డ్రగ్ పిల్స్ ఉండడంతో భయపడిపోయి వెంటనే తమకు సమాచారం అందించినట్టు రాక్ హిల్ పోలీస్ అధికారులు తెలిపారు.

ఒక్కోదాంట్లో పదివేల పిల్స్ ఉన్న రెండు సంచులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఒక్కో పిల్ విలువ 20 డాలర్లు ఉంటుందని, వాటి మొత్తం విలువ 4 లక్షల డాలర్లు (దాదాపు రూ.2.6 కోట్లు) ఉంటుందని చెప్పారు. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న యార్క్ కౌంటీ మల్టీజ్యూరిస్ డిక్షనల్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. డ్రగ్స్ కాలిఫోర్నియా నుంచి వచ్చినట్టు యూనిట్ కమాండర్ మార్విన్ బ్రౌన్ తెలిపారు. తనపేరు, అడ్రస్‌ను ఉపయోగించుకుని ఎవరో ఈ పనిచేసి ఉంటారని బాధిత మహిళ తెలిపింది. ఆమె పేరును వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.

More Telugu News