TTD: జనవరిలో తిరుమల ఆర్జిత సేవా టికెట్ల వివరాలు... బుకింగ్ విధానం!

  • 50,879 టికెట్లు అందుబాటులోకి
  • 6,744 టికెట్లు లాటరీ విధానంలో పంపకం
  • 13వ తేదీ వరకూ రిజిస్టర్ చేసుకునే అవకాశం

జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ ఈ ఉదయం విడుదల చేసింది. ముఖ్యమైన తోమాల, అర్చన, సుప్రభాతం, నిజపాదదర్శనం, అష్టదళ పాదపద్మారాధన సేవా టికెట్లను మాత్రం ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తామని, మిగతా సేవలైన కల్యాణోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితరాలను వెబ్ సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని టీటీడీ పేర్కొంది.

మొత్తం 50,879 సేవా టికెట్లను అందుబాటులో ఉంచామని, ఇందులో 6,744 సేవా టికెట్లను డిప్ ద్వారా కేటాయిస్తామన్నారు. సుప్రభాత సేవకు 4,104, తోమాల సేవకు 50, అర్చనకు 50, నిజపాద దర్శనానికి 2,300, అష్టదళ పాదపద్మారాధనకు 240 టికెట్లు కేటాయించారు. ఇవి కావలసిన వారు, నేటి నుంచి 13వ తేదీ ఉదయం 10 గంటల్లోగా 'www.ttdsevaonline' వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి.

తాము ఏ తేదీన, ఏ సేవ చేయాలని అనుకుంటున్నామో తెలియజేయాలి. అన్ని సేవలకూ, ఎప్పుడైనా వెళ్తామని భావించేవారు అన్నింటినీ ఎంచుకోవచ్చు. ఇక రిజిస్టర్ అయిన వారి నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎలక్ట్రానిక్ డిప్ తీస్తారు. ఆపై టికెట్లను పొందిన వారికి ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ వస్తుంది. వారు 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆన్ లైన్ విధానంలో డబ్బును చెల్లించాల్సి వుంటుంది.

More Telugu News