honeypreet: హనీప్రీత్ అరెస్ట్ వెనుక ఏదో తేడా కొడుతోంది: హర్యానా సీఎం సంచలన వ్యాఖ్య

  • అరెస్టుపై అనుమానాలు ఉన్నాయి
  • పంజాబ్ పోలీసులు సమాచారాన్ని పంచుకోలేదు
  • మాకూ చెప్పివుంటే త్వరగా అరెస్ట్ చేసేవాళ్లం
  • విచారణలో ఇప్పటికీ నోరు విప్పని హనీప్రీత్
  • లై డిటెక్టర్ టెస్టు కోసం అనుమతి కోరనున్న పోలీసులు

రెండు రోజుల క్రితం పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసిన గుర్మీత్ రామ్ రహీమ్ ఇష్టసఖి హనీప్రీత్ సింగ్ గురించి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చండీగఢ్ హైవేలో హనీప్రీత్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, 'దాల్ మే కుచ్ కాలా హై' (అనుమానించదగ్గ విషయం ఉంది) అని అన్నారు.

పంజాబ్ పోలీసులకు హనీప్రీత్ గురించి సర్వమూ తెలుసునని, వారు తమతో సమాచారాన్ని పంచుకోలేదని ఆరోపించారు. పోలీసులు హనీప్రీత్ ను ట్రాక్ చేశారని, తమకు విషయం తెలిపితే ఆమెను మరింత త్వరగా పట్టుకుని ఉండేవాళ్లని చెప్పారు. తమ ప్రమేయం లేనందునే అరెస్ట్ ఆలస్యం అయిందని అన్నారు.

ఇదిలావుండగా తమ విచారణలో హనీప్రీత్ ఎంతమాత్రమూ నోరు విప్పకపోవడంతో ఆమెకు లైడిటెక్టర్ పరీక్షలను చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరనున్నట్టు తెలుస్తోంది. ఆమెను పంచకుల సెక్టార్-20లోని రాంపూర్ జైల్లో ఉంచిన పోలీసులు, గుర్మీత్ తో సంబంధాలు, ఆయన జైలుకు వెళ్లిన తరువాత జరిగిన విధ్వంసం గురించి సమాచారాన్ని రాబట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆమె దాదాపు నెల రోజులకు పైగా తప్పించుకోవడానికి పంజాబ్ నేత హర్మీందర్ సింగ్ జస్సీ కుమార్తె కారణమని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్మీత్ కుమారుడిని వివాహం చేసుకున్న హర్మీందర్ సింగ్ కుమార్తె, హనీప్రీత్ తప్పించుకునేందుకు సహకరించిందని, తన పరపతిని వాడి, ఆమెకు రక్షణ కల్పించిందని తెలుస్తోంది.

More Telugu News